ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతల హర్షం
సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
దేశంలో దమ్మున్న సీఎం కేసీఆరే
నినదించిన రైతులు, ప్రజలు
‘మనసున్న మారాజు మా ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో ఇలాంటి దమ్మున్న సీఎం మరొకరు లేరు. మేమంతా ఎప్పుడూ ఆయన వెన్నంటే ఉంటాం. రాష్ర్టాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడికి జేజేలు’ అంటూ అన్నదాతలు, ప్రజలు నినదించారు. ఓవైపు వరి కొనుగోళ్లు, మరోవైపు జీవో 111 ఎత్తివేతతో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. రైతులు, వివిధ గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించారు.
మేడ్చల్/కీసర, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ): యాసంగి వడ్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. మేడ్చల్ జిల్లా కీసరలో జరిగిన సంబురాల కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం వడ్లు కొనకుండా తెలంగాణ రైతులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. రానున్న రోజులలో బీజేపీకి ప్రజలు బుద్ధి చేప్పేందుకు సిద్ధం అవుతున్నారని అన్నారు. ఈ సంబురాలలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, రైతు బంధు కమిటీ అధ్యక్షుడు నందారెడ్డి, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ రామారం సుజాత, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, మండల టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.