సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): విద్యుత్ శాఖలో అవినీతి మితిమీరిన స్థాయికి చేరింది. ఉన్నతాధికారులు మొదలు కొని కింది స్థాయి ఉద్యోగుల వరకు పదుల సంఖ్యలో ఏసీబీ అధికారుల వలకు చిక్కుతున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఖైరతాబాద్‌లోని కార్పొరేట్ కార్యాలయంలోనే అవినీతి ఫిర్యాదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి ప్రతి రోజూ 10 నుంచి 15 వరకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
విద్యుత్ శాఖలో అధికారులు ఎవరైనా పనికి లంచం అడిగితే ఫిర్యాదు చేయవచ్చని, ఇందుకోసం సీఎండీ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెబుతూ..రెండు ఫోన్ నంబర్లు ఇచ్చారు. విద్యుత్ సంస్థలో సిబ్బంది, అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే ఫిర్యాదు చేసే వ్యవస్థను సీఎండీయే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండటంతో ఒక్కసారిగా డిస్కం పరిధిలోని ఆపరేషన్స్ విభాగంలో వణుకు మొదలైంది. ఇప్పటి వరకు అడ్డగోలుగా డబ్బులు డిమాండు చేస్తూ పనులు చేసిన అధికారులకు ఇప్పుడు కంటి మీద కునుకు ఉండటం లేదు.
గతంలో చేసిన అవినీతి పనులపైనా వినియోగదారులు ఫిర్యాదు చేస్తే తమ పని అంతే అన్న భావనలో కొందరు కొట్టుమిట్టాడుతున్నారు. ఫిర్యాదు రాగానే వేగంగా విచారణ చేపట్టి..చర్యలు తీసుకుంటుండడంతో వినియోగదారులు ఎక్కడ తమ పేర్లు చెబుతారోనన్న భయాందోళన అవినీతిపరుల్లో నెలకొన్నది.ఇటీవల వివిధ కారణాలపై నలుగురు విద్యుత్ అధికారులపై సీఎండీ క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడంతో అవినీతిపరులు వణికిపోతున్నారు.