సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలో ఉన్న కొన్ని బస్తీ దవాఖానలు, పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, ఏరియా దవాఖానల్లో నిర్వహించే బీ12, డీ3 పరీక్షలతోపాటు మరికొన్ని పరీక్షలు ప్రస్తుతం చేయడంలేదని రోగులు వాపోతున్నారు. డాక్టర్ల ఫీజు కంటే వైద్య పరీక్షల ఖర్చే వేలు, లక్షలు దాటుతున్నదనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేద రోగులపై ఆర్ధిక భారం తగ్గించే లక్ష్యంతో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
వీటిలో 134 రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తూ వచ్చింది. ప్రతిరోజు ఒక్క గ్రేటర్లోనే సుమారు 10వేలకు పైగా వివిధ రకాల వైద్య పరీక్షలను తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంట్రల్ ల్యాబ్లో నిర్వహించడమే కాకుండా 24 గంటల్లోనే దాదాపు అన్నిరకాల వైద్య పరీక్షలు జరిపి, నివేదికలను రోగుల సెల్ఫోన్లకే పంపిం చారు. దీని వల్ల ప్రజలకు ఆర్థిక భారం తప్పేది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీటి నిర్వహణ సరిగా పట్టించుకోకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో సేవలను పునరుద్ధరించాలని రోగులు కోరుతున్నారు.
సెంట్రల్ ల్యాబ్లో ఎక్విప్మెంట్ బ్రేక్డౌన్ వల్ల రెండురోజుల పాటు బి12, డీ3 పరీక్షలకు అంతరాయం ఏర్పడిందని తెలంగాణ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సమస్య పరిష్కారం కావడంతో వెంటనే సేవలను పునరుద్ధరించడం జరిగిందని, ఇప్పుడు అన్ని సెంటర్లలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.
జిల్లాల్లో అయితే 134 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో మెడికల్ కాలేజీలు ఉన్నందున అక్కడ అందుబాటులో ఉన్న సర్జికల్ ప్రొఫైల్, టీబీ, హెచ్ఐవీ వంటి కొన్ని రకాల మెడికల్ టెస్టులు మినహా 134లోని ఇతర అన్ని రకాల పరీక్షలు జరుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. – ల్యాబ్ అధికారులు