సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): నిరుపేద రోగులకు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆపన్న హస్తంగా మారింది.అంతేకాకుండా నిరుపేద రోగులకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలనే నాటి కేసీఆర్ సర్కార్ ఆశయం ఫలిస్తోంది. సాధారణంగా ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు వైద్యుల వద్దకు వెళ్తే సమస్యను గుర్తించేందుకు అవసరమైన వైద్యపరీక్షలు రాయడం సహజం. ఈ పరీక్షల నివేదిక ఆధారంగానే వైద్యులు రోగులకు అవసరమైన చికిత్సను ప్రారంభిస్తారు.
ప్రస్తుత రోజుల్లో వైద్యుల కన్సల్టేషన్, చికిత్స ఖర్చుల కంటే మూడు నాలుగు రెట్లు వైద్యపరీక్షలకే ఖర్చవుతున్నది. చిన్నపాటి జ్వరం వచ్చినా మందులు, వైద్య ఫీజు కలిపి రూ.500 నుంచి రూ.1000 మధ్య ఖర్చయితే వైద్య ఖర్చులు మాత్రం రూ.3వేల నుంచి రూ.5వేల వరకు అవుతున్నది. ప్రైవేటులో డెంగీ పరీక్ష చేస్తే రూ.3వేల నుంచి రూ.5వేలు, వైరల్ ఫీవర్ టెస్టులు చేయిస్తే రూ.1500 నుంచి రూ.2వేల చొప్పున వైద్యపరీక్షల ఖర్చులే రోగులకు ఆర్థిక భారంగా మారుతున్నది.
అయితే సర్కార్ దవాఖానల్లో వైద్యపరీక్షలతో పాటు చికిత్స తదితరాలన్నీ పూర్తి ఉచితంగానే అందిస్తారు. కానీ అక్కడున్న రద్దీ, నిరీక్షణ, సమయం కేటాయించాల్సి రావడం తదితర కారణాల వల్ల చాలా మంది ప్రైవేటు లేదా తమ నివాసాలకు దగ్గరగా ఉన్న క్లినిక్‌లను ఆశ్రయిస్తుంటారు. దీంతో రోజువారీ పనులు చేసుకుని జీవించే వారు, చిరు వ్యాపారులు, దినసరి కూలీలు, ప్రైవేటు చిన్నస్థాయి ఉద్యోగులు తదితర నిరుపేద రోగులకు వైద్య పరీక్షలతో పాటు చికిత్స ఇతర అంశాలు తీరని భారంగా మారాయి.
ఇది గమనించిన నాటి కేసీఆర్ సర్కర్ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సర్కార్ వైద్యరంగాన్ని బలోపేతం చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా హాస్పిటల్స్ నుంచి శాంపిల్స్‌ను సేకరించి నారాయణగూడ ఐపీఎంలో ఉన్న తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు తరలిస్తారు. ఈ ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులకు అవసరమైన వైద్యపరీక్షలకు సంబంధించిన రక్త, మల, మూత్ర నమూనాలను సేకరించి వాటిని క్లస్టర్ల వారీగా నారాయణగూడలోని సెంట్రల్ ల్యాబ్ అంటే నారాయణగూడలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు తరలిస్తారు.
10వేల నమూనాలు…
గ్రేటర్ పరిధిలో 480 సెంటర్ల నుంచి ప్రతి రోజు రోగుల వద్ద నుంచి సుమారు 10వేల నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నమూనాలను పరీక్షించి వ్యాధులను నిర్థారించిన అనంతరం వాటికి సంబంధించిన నివేదికలను నేరుగా రోగుల సెల్ఫోన్లకు మెసేజ్ రూపంలో పంపిస్తారు. దీని వల్ల రోగులు నివేదికల కోసం దవాఖానల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే వాటిని తీసుకుని సంబంధిత ఆరోగ్యకేంద్రానికి వెళ్తే చాలు..అక్కడి వైద్యులు నివేదికల ఆధారంగా రోగికి అవసరమైన చికిత్స అందిస్తారు.
పైసా ఖర్చులేకుండా..
గ్రేటర్ వ్యాప్తంగా రోగుల నుంచి సేకరించిన నమూనాలకు ప్రతిరోజూ రూ. 25 లక్షలకు పైగా విలువ చేసే వైద్యపరీక్షలు పైసా ఖర్చులేకుండా పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత రోజుల్లో ప్రతి వ్యక్తి తాను సంపాదించిన నెలసరి జీతంలో 10 నుంచి 15 శాతం వైద్యఖర్చులకే కేటాయించాల్సి వస్తున్నదని పలు అధ్యయనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అధ్యయనాల ప్రకారం.. కేసీఆర్ ప్రభుత్వం అందుబాటులోకి తెలంగాణ డయోగ్నోస్టిక్ సెంటర్ వల్ల ప్రజలకు ప్రతి నెలా వైద్యఖర్చుల భారం దాదాపు తగ్గినట్లు చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
2018లో అందుబాటులోకి..
మెరుగైన వైద్యం అందించడంలో భాగంగానే చికిత్సతో పాటు వైద్యపరీక్షలను సైతం మెరుగుపర్చాలనే లక్ష్యంతో 2018లో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను నాటి కేసీఆర్ సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదట్లో హైదరాబాద్ జిల్లాలోనే అందుబాటులోకి వచ్చిన ఈ సేవలను దశల వారీగా జీహెచ్ఎంసీ, ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలకు విస్తరించిన విషయం తెలిసిందే.