ఎర్రగడ్డ : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి పర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ ప్రభాత్నగర్లో రూ.35 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఆయన మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ అన్ని రంగాలను అగ్రపథంలోకి తీసుకెళ్తున్న కేసీఆర్ ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఎర్రగడ్డ డివిజన్ విషయానికి వస్తే కేవలం ఐదారేండ్ల వ్యవధిలో అన్ని బస్తీలు, కాలనీల రూపురేఖలు మారిపోయిన వైనాన్ని నేడు మనం చూస్తున్నామని వివరించారు.
అన్ని బస్తీలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా ముందుకు వెళ్లటం జరుగుతుందన్నారు. సకల సౌకర్యాలతో ఆధునిక వసతులతో జనప్రియ సమీపంలోని ఖాళీ స్థలంలో త్వరలో కల్యాణ మంటప నిర్మాణానికి శ్రీకారం చుడతామని వెల్లడించారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, నేతలు పల్లవియాదవ్, గంట మల్లేష్, మహ్మద్అజీం, ముస్తాక్, ప్రభాత్నగర్ బస్తీ నేతలు యాదగిరి, బాలాజీ, మహిళా నాయకురాళ్లు సుధ, బాలసూర్య, జులేక, రజియా తదితరులు పాల్గొన్నారు.