సిటీ బ్యూరో, నవంబర్ 8(నమస్తే తెలంగాణ) : శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెంచాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. గల్లీలు, కాలనీల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. పోల్ పోరులో మాటల తూటాలు, సవాల్-ప్రతి సవాల్‌తో రాజకీయం వేడెక్కింది. జాతీయ, రాష్ట్రస్థాయి నేతలతో బహిరంగ సభలు, రోడ్‌షోలు, అంతర్గత సమావేశాలతోపాటు స్టార్ క్యాంపెయిన్లను ప్రచార పర్వంలోకి దించి ఓట్లను కొల్లగొట్టేందుకు అభ్యర్థులు ఎవరికి వారే తనదైన శైలిలో ప్రచారంలో రాణిస్తున్నారు.
ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ ముందుంది. గడిచిన రెండున్నర నెలలకు పైగా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనతో హోరెత్తిస్తున్నారు. మొదటి నుంచి ఎక్కడ అసంతృప్తుల బెడత లేకుండా మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. గ్రేటర్ ప్రచార బాధ్యతలు తీసుకున్న మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఆత్మీయ సమావేశాలు, బూత్ కమిటీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలతో శ్రేణుల్లో ఉత్సాహాన్ని మరింత రెట్టింపుజేశారు. ఇదే సమయంలో ఈ నెల 15వ తేదీ నుంచి రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున ఈనెల 22వ తేదీ వరకు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించేందుకు ఎన్నికల కార్యాచరణను ప్రకటించారు.
నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరడంతో బీఆర్ఎస్ అభ్యర్థులు రెట్టింపు ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో ప్రచారం సాగిస్తున్నారు. పాదయాత్రలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. గ్రేటర్‌లోని అన్ని స్థానాల్లో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తొమ్మిదిన్నరేండ్లలో పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. లబ్ధిదారులను నేరుగా కలుసుకుంటూ బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రచారంలో కారు స్పీడ్‌ను టాప్‌గేర్‌లోకి చేర్చారు. భారీ మెజార్టీతో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా సాగుతున్న అభ్యర్థుల ప్రచారానికి సబ్బండ వర్గాలు ఆదరిస్తున్నారని, పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు చివరి అంకానికి చేరింది. ఐదవ రోజు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి నామినేషన్ల సందడి నెలకొన్నది. స్వతంత్ర అభ్యర్థులకు మొదలుకొని ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి భారీ ఎత్తున తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ఇప్పటికే నామినేషన్ వేసిన కొందరు మరోసారి అదనంగా సెట్లు దాఖలు చేశారు. బుధవారం నామినేషన్ల దాఖల ప్రక్రియలో గులాబీ హవా జైత్ర యాత్రను తలపించింది. అన్ని నియోజకవర్గాల నుంచి 76 మంది అభ్యర్థులు 86 నామినేషన్ సెట్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖైరతాబాద్ దానం నాగేందర్, అంబర్‌పేట కాలేరు వెంకటేశ్, సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు.
ఈనెల 3వ తేదీతో మొదలైన నామినేషన్ల స్వీకరణ ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో అభ్యర్థులు దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. మొత్తంగా ఐదు రోజులపాటు నామినేషన్లు స్వీకరించగా, గురు, శుక్రవారం రెండురోజుల పాటు అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ రెండు రోజులపాటు ప్రధాన పార్టీల నుంచి, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, ఇతర ప్రముఖులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మేడ్చల్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజక వర్గాలకు సంబంధించి బుధవారం 41 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి 17, మల్కాజిగిరి 7, కుత్బుల్లాపూర్ 8, కూకట్పల్లి 3, ఉప్పల్ 4 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి మొత్తం 73 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ స్పష్టం చేశారు.