వందేండ్లకు పైగా చరిత్ర గల్గిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వం ఉన్నంత వరకే ఓ వెలుగు వెలిగింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, కొత్తగా ఏర్పడిన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో పార్టీకి తిరుగులేని అభిమాన జనం తోడయ్యింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఏర్పడటం, తద్వారా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్రంపై, నిధులు, నీళ్లు, ఇతరత్రా మౌలిక వసతులపై పట్టు, పలు అంశాలపై అవగాహన లేకపోవడంతో పార్టీలో ఉన్న నేతలంతా వలస బాట పట్టారు. దీంతో పార్టీ బలం నీరుగారిపోయింది. ప్రస్తుతం గ్రేటర్‌లోనే కాకుండా రాష్ట్రం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు, కార్యకర్తలు కరువయ్యారు. ఎవరు ఎన్ని చెప్పుకొచ్చినాఇది వాస్తవం. ప్రస్తుతం, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ‘గ్రేటర్’లో అస్తవ్యస్తంగా మారింది.

Revanthreddy
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబరు 4(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అస్తవ్యస్తంగా తయారైంది. కనుచూపు మేరలో సరైన నాయకుడు లేక అనేక నియోజకవర్గాల్లో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా తయారైంది. ఒకవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఖరారుతో క్షేత్ర స్థాయిలో దూసుకుపోతుంటే.. మరోవైపు అసలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అంటూ లేకపోవడంతో నియోజకవర్గాల్లోని క్యాడర్ అయోమయంలో పడిపోయింది.
ప్రధానంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంజన్ కుమార్ యాదవ్ ఉన్నప్పటికీ ఆయన పేరుకు మాత్రమే పరిమితమైనట్లు పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంజన్ ఉన్నాడా? లేడా? అన్నట్లుగా పరిస్థితి తయారు కావడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుకూలంగా మలుచుకొని టికెట్ల వ్యవహారం నడుపుతున్నాడని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక… శివారులో అటు రంగారెడ్డి, ఇటు మేడ్చల్ పరిధుల్లోనూ డీసీసీలను నామ మాత్రంగా చేసి రేవంత్ నేరుగా వ్యవహారాన్ని నెరుపుతుండటంపై ఆయా జిల్లాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అందుకే, మీడియా ముందుకు వచ్చి భూ దందాలు, కోట్ల రూపాయలు చేతులు మారుతున్న వైనాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు.
గ్రేటర్లో రాజుకుంటున్న రేవంత్ కుంపటి
గ్రేటర్ హైదరాబాద్‌లో గతమెంతో ఘనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు దీనంగా తయారైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ దూకుడు ముందు కాంగ్రెస్ నిలవలేకపోయింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు తోడు హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్న తీరుకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులయ్యారు. దీంతో గ్రేటర్ పరిధిలో ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ ప్రాతినిథ్యం లేదు.
అంతే కాదు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి కేవలం రెండు డివిజన్లు మాత్రమే సొంతం అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొచ్చినా… నగరంలో ఆ పార్టీ ఉనికే కనిపించడం లేదు. దీనికి తోడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఏనాడూ పార్టీని పట్టించుకున్న దాఖలాలు లేవని స్వయాన ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇదే అదునుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కొందరు నాయకులను ప్రోత్సహించి, కుంపటి రాజేయడంతో ప్రతి నియోజకవర్గంలోనూ వర్గాల పోరుతో పార్టీ కుదేలయిందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో పరిస్థితిని పరిశీలిస్తే..
జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో..
పీజేఆర్ కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డి ఆది నుంచి పార్టీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఈయన టికెట్ ఆశిస్తుండగా… రేవంత్ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. దీంతో గత కొంత కాలంలోనే అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడుసార్లు పర్యటించి, తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. ఈ క్రమంలోనే విష్ణువర్దన్‌రెడ్డి వర్గం, అజారుద్దిన్ వర్గం నేతల మధ్య ఘర్షణ కూడా చోటుచేసుకుంది.
ఖైరతాబాద్‌లో..
పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లి టికెట్ ఆశిస్తున్నారు. కానీ, రేవంత్ ఆశీర్వాదం రోహిన్‌రెడ్డికి ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం నుంచి తిరుగుబాటు అనివార్యంగా కనిపిస్తుంది.
కంటోన్మెంట్ స్థానంలో..
ఇక్కడ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఇక్కడ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా… ఆయన అంతా హస్తిన బాటే పడతారు. పిడమర్తి రవి (ఖమ్మం నేత పొంగులేటి వర్గం) ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తుండగా, టికెట్ ఆశిస్తున్న మరో నాయకుడు జీవకన్ కొల్లాపూర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు వర్గం, కాగా రేవంత్‌రెడ్డి మాత్రం గద్దర్ కుమార్తె వెన్నెలకు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
సికింద్రాబాద్‌లో..
నలుగురు నాయకులు ప్రధానంగా టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ఆడం సంతోష్, దీపక్ జాన్ మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆడం సంతోష్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వర్గం కావడంతో గత రెండు, మూడు నెలల కాలంలోనే ఇద్దరు నాయకులు పార్టీలో చేరారు. నోముల ప్రకాశ్ రావు, సాయిబాబా ఇద్దరూ కొత్తగా చేరి టికెట్ రేసులో ఉండగా.., నోముల ప్రకాశ్ రావు రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో వచ్చాడని పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో ఇక్కడా రేవంత్ తన వర్గంతో కుంపటి రాజేశాడు.
రంగారెడ్డిలో రచ్చరచ్చ..
పట్టణ రంగారెడ్డిలోనూ కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఇక్కడ కూడా డీసీసీ అధ్యక్షుడిని నామమాత్రం చేసి… రేవంత్ పావులు కదుపుతున్నట్లు ఆ పార్టీ నేతలే మీడియా సమావేశాల్లో వెల్లడిస్తున్నారు.
ఈ క్రమంలోనే మహేశ్వరం నియోజకవర్గంలో ‘సీటుకు నోటు’ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇక్కడ రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డితో పాటు నియోజకవర్గ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, కొత్త మనోహర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ జంగారెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి ఎలిమినేటి అమరేందర్‌రెడ్డి, కొంత కాలం కిందట పార్టీలో చేరిన బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ప్రధానంగా టికెట్ ఆశిస్తున్నారు. అయితే, చిగురింత నర్సింహారెడ్డి తనకే టికెట్ వచ్చిందని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఐదెకరాల భూమి, రూ.10 కోట్లు ఇచ్చానని ప్రచారం చేసుకుంటున్నట్లుగా పార్టీ నేతలే ఆరోపిస్తుండటంతో పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రధానంగా ‘సీటుకు నోటు’ వ్యవహారం నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానూ కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బ తీసిందని పార్టీ నేతలే వాపోతున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో..
ప్యారచూట్ నేతతో స్థానిక నాయకులు తీవ్ర అసంతృప్తిలోకి వెళ్లారు. పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధు యాష్కీ ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో టికెట్ ఆశిస్తున్న మల్రెడ్డి రాంరెడ్డి, దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ ఢిల్లీ సహా రాష్ట్రస్థాయి నేతలకూ వినతిపత్రం ఇవ్వడంతో పాటు ప్యారచూట్ నేతకిస్తే సహకరించేదిలేదని అల్టిమేటం కూడా జారీ చేశారు.
శేరిలింగంపల్లిలో..
గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన భిక్షపతి యాదవ్ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ నుంచి కొత్త ముఖాలు టిక్కెట్ రేసులోకి వచ్చాయి. ఇక్కడ కీలక నేత అంటూ లేడు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. రఘునాథ్ యాదవ్, జైపాల్, శ్రీనివాస్‌లు ప్రధానంగా టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. ఇక్కడ కీలకమైన నాయకుడే లేడంటే వీరిలో ఏ ఒక్కరికి ఇచ్చినా మిగిలినవారు తిరుగుబాటు చేసేలా ఉన్నారు.
మేడ్చల్‌లో మైనంపల్లి మంట..
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్‌లో ప్రస్తుతం మైనంపల్లి హన్మంతరావు వ్యవహారం మంట రేపుతున్నది. ఇక్కడ కూడా డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌కే ఎసరు పెట్టి హన్మంతరావుకు ఒకటీ, రెండు కాదు.. మూడు టికెట్లు ఇప్పించేందుకు రేవంత్‌రెడ్డి ముందు ఉండి పావులు కదపడం గమనార్హం.

మల్కాజిగిరి నియోజకవర్గంలో..
కాంగ్రెస్‌ను నమ్ముకొని డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రికి రాత్రి రేవంత్… మైనంపల్లి హన్మంతరావును దింపాడు. ఉదయపూర్ తీర్మానాన్ని ఉల్లంఘించి ఒకే కుటుంబంలో రెండు సహా మొత్తం మూడు టికెట్లు ఇప్పిస్తాననే హామీతో కాంగ్రెస్‌లోకి తీసుకున్నట్లు మైనంపల్లినే వెల్లడిస్తున్నాడు. దీంతో మైనంపల్లికి టికెట్ ఇస్తే మల్కాజిగిరిలో కాంగ్రెస్ పూర్తిగా మునిగిపోతుందని, మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ కీలక నేతలు ప్రెస్‌మీట్ పెట్టి మరీ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు. కానీ, రేవంత్‌తో పాటు అధిష్టానం కూడా బీసీ నేతను బలి చేసేందుకు మొగ్గు చూపడంతో తత్వం బోధపడిన నందికంటి శ్రీధర్ తన రాజీనామాతో బిగ్ షాక్ ఇచ్చారు. ఆయనతో పాటు మల్కాజిగిరి కాంగ్రెస్ నేతలంతా రాజీనామా బాట పట్టడంతో నియోజకవర్గ కాంగ్రెస్ ఖాళీ అయింది.
అంబర్‌పేటలో..
పీసీసీ జనరల్ సెక్రటరీ ఆర్.లక్ష్మణ్ యాదవ్‌కు టికెట్ ఇప్పించుకునేందుకు సీనియర్ నేత వీహెచ్ ప్రయత్నిస్తుండగా.. గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతె రోహిత్ కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు నూతి శ్రీకాంత్ గౌడ్ కోసం పావులు కదుపుతున్నారు.
కూకట్‌పల్లిలో..
ఇక్కడ నుంచి పార్టీ అభ్యర్థిగా 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అందరు కార్పొరేటర్ స్థాయి కన్నా తక్కువేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ముందు వరసలో సత్యం శ్రీరంగం, గొట్టిముక్కల వెంగళరావు, పటోళ్ల నాగిరెడ్డిలతో పాటు పలువురు టిక్కెట్ రేసులో ఉన్నారు.
కుత్బుల్లాపూర్‌లో..
ఈ నియోజకవర్గంలోనూ గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలోకి వెళ్లారు. దీంతో ఇక్కడ బలమైన నాయకుడు లేకపోగా… ఉన్నంతలోనూ అనేక మంది పోటీపడుతున్నారు.
మేడ్చల్‌లో..
అసలు కాంగ్రెస్ ఉందా? అనే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఆ పార్టీ తరపున గెలిచిన కేఎల్ఆర్ ప్యారాచూట్ వేసుకొని వికారాబాద్ జిల్లాకు వెళ్లారు. దీంతో ఇక్కడ కీలకమైన నాయకులెవరూ లేరు. ద్వితీయ శ్రేణి నాయకులే పోటీ పడుతుండటంతో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హన్మంతరావు ఇక్కడ తన అనుచరుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒప్పందంలో భాగంగా కుటుంబంలో రెండు టికెట్లతో పాటు మేడ్చల్ నుంచి తన అనుచరుడు నక్కా ప్రభాకర్ గౌడ్‌కు టికెట్ ఇవ్వాలని డిమాండు చేయడమే కాదు టికెట్ ఖరారైందని కూడా చెబుతున్నాడు.