సిటీబ్యూరో, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): తెలంగాణ కేబినెట్ జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేయాలంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మంత్రి శ్రీధర్‌బాబు కేబినెట్ నిర్ణయాలను వెల్లడించగా అందులో.. గ్రేటర్ పరిధిలో అండర్‌గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో అందునా నగరంలో ఈ యుజి కేబుల్ వ్యవస్థ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
అండర్‌గ్రౌండ్ కేబుల్ వేయాలనుకోవడం మంచి నిర్ణయమే అయినా ఇది ఎంతమేరకు సాధ్యమవుతుందనే ప్రశ్న విద్యుత్‌రంగ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యుజి వేయాలంటే నగరం మధ్యలో చాలా కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. గత సంవత్సరం సమ్మర్ యాక్షన్ ప్లాన్ మొదలుకొని జూబ్లి బస్టాండ్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వంటిచోట్ల యుజి కేబుల్ కోసం ఇచ్చిన పనులే ఆగిపోయాయి. సికింద్రాబాద్ టెండర్లు ఖరారైనా పనులలో జాప్యం జరుగుతోంది. ఇక జూబ్లిలో ఓవర్‌హెడ్ లైన్‌తోనే సరిపెట్టుకున్నారు. యూజీ కేబుల్ విషయంలో ఒకవైపు నగరంలో వేయడం కష్టమైతే మరోవైపు కేబుల్ వ్యవహారంలో కమీషన్ల దందా మరో సమస్యగా మారింది.
నగరంలో కష్టమే..!
ప్రధానంగా గ్రేటర్ పరిధిలో ఉన్న 60లక్షల విద్యుత్ కనెక్షన్లలో దాదాపు 52లక్షలు గృహ విద్యుత్ కనెక్షన్లే కాగా.. పాతబస్తీతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నిజాం కాలంలో వేసిన ఓవర్‌హెడ్ లైన్సే ఉన్నాయి. వీటిలో చాలావరకు శిథిలావస్థకు చేరాయి. నగరంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. సాధారణ రోజుల్లో రోజుకు 60 నుంచి 65 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగితే.. వేసవి, ప్రత్యేక సందర్భాల్లో రోజుకు 85 నుంచి 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది.
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 33 కేవీ సబ్స్టేషన్లు 498 ఉండగా, 33 కేవీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ 1280కి.మీ.మేరకు ఉండగా 11కేవీ ఓవర్‌హెడ్ కేబుళ్లు 957 కి.మీ ఉన్నాయి. ఇంకా 11కేవీ 21,643కి.మీ, 33కేవీ విద్యుత్ లైన్లు 3725 కి.మీ వేయాల్సిందిగా అధికారులు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌కు సుమారుగా రూ.15వేల కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే యుజి కేబుల్ ఎక్కడి నుంచి ఎలా వేయాలనే విషయంలోనే ఇప్పటివరకు అధికారులకు ఒక స్పష్టత లేదని ఓ సీనియర్ అధికారి చెప్పారు. బెంగళూరుకు వెళ్లి అక్కడ యుజి విధానాన్ని పరిశీలించి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని ప్రాంతాల్లో అనుకూలంగా ఉంది కానీ మిగతా చోట్ల చాలా కష్టమైందని, అలా చేయడం హైదరాబాద్ నగరంలో చాలా కష్టమని ఆయన పేర్కొన్నారు.
యూజీ కేబుల్‌కు అన్నీ అడ్డంకులే..!
అండర్‌గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే అన్నీ అడ్డంకులే ఉన్నాయని విద్యుత్ రంగ నిపుణులు చెప్పారు. ఇప్పటికే గృహ వినియోగదారులకు సంబంధించి యూజీ వేస్తేనే కనెక్షన్ ఇస్తామన్న నిబంధనల విషయంలోనే చాలావరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, యుజి వేసే సమయంలో చాలా వరకు డ్రిల్లింగ్‌లో సమస్యలు వస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఒక కేబుల్ వేయడానికి రోడ్డును 4 నుంచి 6 మీటర్ల వరకు తవ్వితేనే 33కేవీ కానీ, 11 కేవీ కానీ సురక్షితంగా ఉంటుందని, హారిజంటల్ విధానంలో 2-3 మీటర్ల లోతులో హడావిడిగా తవ్వకాలు చేసి పనులు పూర్తయినట్లు చెబితే ఆ కేబుళ్లు ఎప్పుడైనా రోడ్డుపైకి తేలితే ప్రజలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందని రిటైర్డ్ విద్యుత్ ఇంజనీర్లు చెప్పారు.
ఈవిషయంలో కొత్త టెక్నాలజీ వాడకాన్ని స్వాగతిస్తామని, అయితే అది ఏ మేరకు సత్ఫలితాలిస్తుందో చూడాలని వారు సూచించారు. ఇదే సమయంలో నాలుగు నుంచి ఆరు ఫీట్ల లోతులో తవ్వాలంటే జీహెచ్ఎంసీ అనుమతులు కష్టమేనని, అయినా ప్రభుత్వ పరంగా వేస్తున్న కేబుల్ కావడంతో అక్కడ పర్మిషన్లు వచ్చినా నగరంలో డ్రైనేజీ, వాటర్ పైప్లైన్ల వాడకంపై యుజి విద్యుత్ కేబుల్ తవ్వకాల ప్రభావం పడుతుందని, తద్వారా నగరప్రజలకు కొత్త సమస్యలు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రోడ్ల మధ్యలో డ్రైనేజి పైప్‌లైన్ ఉండగా, తవ్వకాలు జరిపే సమయంలో ఏదైనా సమస్య వస్తే స్థానికులనుంచి వ్యతిరేకత వస్తుందనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గచ్చిబౌలి, కొండాపూర్, నార్సింగి తదితర నగరశివారు ప్రాంతాల్లో కొంత మేరకు యుజి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు.
మేడ్చల్ నుంచి మొదలు పెట్టేందుకు ప్రయత్నం..!
హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్ పరిధిలో పూర్తిస్థాయి భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ మేడ్చల్ జిల్లానుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్పాయి. యుజి వ్యవస్థ ఏర్పాటుకు కిలోమీటర్‌కు రూ.2కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒకవేళ ఏదైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే వాటిని ఏ విధంగా గుర్తిస్తారు. తిరిగి కొంత సమయంలోనే విద్యుత్ సరఫరా ఏ విధంగా పునరుద్ధరిస్తారు. తదితర అంశాలపై అధికారులు ఆరా తీశారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్ల మేర భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎంత ఖర్చవుతుంది, తదితర వాటిపై సెక్షన్ల వారీగా వేసిన అంచనాలపై కూడా అనుభవం లేని వారితో చేయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాభద్రతకు సంబంధించిన అంశం కావడంతో యూజీ కేబుల్ వ్యవహారంపై మరింత లోతుగా పరిశోధించి, క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి ప్రజామోదంతో చేయాలని నిపుణులు, సీనియర్ అధికారులు సూచించారు.
ప్రత్యామ్నాయాలు సాధ్యమయ్యేనా..!
ఒకవైపు నగరంలో యుజి నిర్మాణం అసాధ్యమవుతుందన్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు ఈవిషయంలో కొత్త టెక్నాలజీని వాడడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రోడ్డ్రిల్లింగ్ చేయాల్సిన సందర్భంలో హారిజాంటల్ డ్రిల్లింగ్ అనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగించాలని డిస్కం అధికారులు చెప్పారు. ఈ విధానంలో రోడ్లను పెద్దగా తవ్వాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక యంత్రాలతో భూమిలో 2-3మీటర్ల లోతులో కేబుళ్లను వేయవచ్చు. తద్వారా పనులు వేగవంతమవుతాయని అధికారులు చెప్పారు. అయితే ఇలా చేస్తే ఎప్పుడైనా చిన్నచిన్న తవ్వకాలు చేపట్టినా కేబుల్స్ బయటకు తేలుతాయని, నగరంలోని బంజారాహిల్స్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలు తలెత్తినట్లు ఓ సీనియర్ విద్యుత్ ఇంజనీర్ చెప్పారు.
ఈ విషయంలో క్షుణ్నంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి అనుకూలమైన మార్గాలు ఎంచుకున్న తర్వాతే యుజికి వెళ్లాల్సిన అవసరం ఉంటుందని, నగరంలో ఇది కష్టమైనదేనని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చే క్రమంలో యుజి నిబంధన చాలా సమస్యగా మారిందని, దీనిపై డిస్కంకు చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. భూగర్భ కేబుళ్లు వేయడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో ఎయిర్బంచ్డ్ (ఏబీ)కేబుళ్లను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు ముందు డిస్కం ఉన్నతాధికారులు, ఇంజనీర్లు.. బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో పర్యటించారు. బెంగళూరులో మాదిరిగా భూగర్భంలో కేబుళ్ల కోసం ఏర్పాటు చేసే డక్చులను భవిష్యత్‌లో టెలికాం సంస్థలకు లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం సంపాదించవచ్చనే ఆలోచనలో ఉన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్)కింద నిధులు పొందే అవకాశాన్ని కూడా డిస్కం అన్వేషిస్తోంది. ఇప్పటికే కేబుల్ వ్యవహారంలో పలురకాల ఆరోపణలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఈ యుజి కేబుల్ ఆదాయవనరుగా కాకుండా ప్రజోపయోగంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
గ్రేటర్లో విద్యుత్ వ్యవస్థ:
33కేవీ యూజీ కేబుల్స్ :1280 కి.మీ(ప్రస్తుతం ఉన్నవి)
33కేవీ ఓవర్హెడ్లైన్స్ :3725 కి.మీ(వేయాల్సినవి)
11కేవీ యూజీ కేబుల్ :957 కి.మీ(ప్రస్తుతం ఉన్నది)
11కేవీ ఓవర్‌హెడ్‌లైన్లు :21643 కి.మీ(వేయాల్సినది)
డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు :1,50,992
విద్యుత్ స్తంభాలు :5,08,271
33/11 కేవీ సబ్స్టేషన్లు :498
పవర్ ట్రాన్స్ఫార్మర్లు :1,022