హైదరాబాద్/ సిటీబ్యూరో, ఏప్రిల్ 5 : గాలి మాటలు మాట్లాడే.. దొంగల బండి దొరికిపోయింది..పారదర్శకంగా పాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయబోయి.. అడ్డంగా బుక్కైంది. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకునేందుకు ప్రయత్నించిన కమలంపై తెలంగాణ సమాజం దుమ్మెత్తి పోస్తున్నది. ప్రశ్నాపత్రాల లీకు వెనుక ఉన్న వారందరినీ కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో నినదిస్తున్నది. టెన్త్ పేపర్ లీకులో బండి సంజయ్ పాత్ర బహిర్గతం కావడంతో బుధవారం నగరవ్యాప్తంగా బీజేపీపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడిన సంజయ్‌కి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన బీఆర్ఎస్ శ్రేణులు.. పలు చోట్ల బండి దిష్టిబొమ్మలను దహనం చేసి.. నినాదాలతో హోరెత్తించారు.
“మరీ ఇంత అన్యాయమా.. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటారా.. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేకనే బీజేపీ నీచ రాజకీయాలు చేస్తున్నది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే పేపర్ లీకుల కుతంత్రానికి తెరలేపింది” అంటూ.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ పన్నిన కుట్రలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని, బండికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి మండిపడ్డారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి ఆధ్వర్యంలో తార్నాక చౌరస్తాలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో నిందితులకు బీజేపీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగడంలో భాగంగానే ప్రజల్లో అలజడులు సృష్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాడంతో పాటు అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎర్ర నాగరాజు, ఖాజా పాషా, అబ్దుల్ ముజీబ్, యాకూబ్ షరీఫ్, బలరాం, వరికుప్పల శ్యామ్, గాయత్రి, మణెమ్మ, నానునాయక్, జిల్లా బాబు, దళావత్ దుర్గ, శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్‌లో
పదోతరగతి పేపర్ లీకేజీపై బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా బుధవారం రామంతాపూర్ ప్రధాన రహదారిలో మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, కొప్పు నర్సింగ్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, తూటి నర్సింహ, ఏలె రమేశ్, సూరం శంకర్, బోసాన పవన్‌కుమార్, రత్నం, దినేశ్, రాజు, లడ్డు, సాజన్, మల్లేశ్, ఉమేశ్, హరి తదితరులు పాల్గొన్నారు.
పార్శిగుట్టలో
పదో తరగతి పరీక్షా పేపర్ లీకేజీ కుట్రను నిరసిస్తూ ముషీరాబాద్ బీఆర్ఎస్ నేతలు బుధవారం పార్శిగుట్ట చౌరస్తాలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, టి. సోమసుందర్, దీన్దయాళ్రెడ్డి, ఎయిర్టెల్ రాజు, లక్ష్మణ్‌గౌడ్, శ్రీధర్‌రెడ్డి, అజయ్, సదా, భిక్షపతి యాదవ్, శోభ తదితరులు పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో..
పరీక్ష పేపర్ లీకేజీల వెనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నాడని స్పష్టంగా తెలుస్తోందని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ మండిపడ్డారు. తక్షణమే బేషరతుగా బండి సంజయ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. లీకేజీలకు కారకుడైన బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో చెప్పలతో కొట్టి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ కార్యదర్శులు జంగయ్య, నాగరాజుయాదవ్, నాయకులు రమేశ్‌గౌడ్, నాగేందర్రావు, రామకృష్ణ, శ్రీనునాయక్, అంజిబాబు, ప్రశాంత్, నిఖిల్, శ్రవణ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే కుట్ర
రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించడమే లక్ష్యంగా బండి సంజయ్ నేతృత్వంలో పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం నడుస్తోందని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలన్న కుట్రలో భాగంగానే ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం నడిచిందని అన్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలో ఎన్నికల ముందు హింసను ప్రేరేపించి ఓట్లు సాధించాలని బీజేపీ నాయకులు కుట్రలు రచిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, దేదీప్యరావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ పెద్దల ఆదేశాలతోనే లీకేజీ కుట్రలు
పేపర్ లీకేజీకి కారణమైన బీజేపీ ఎంపీ బండి సంజయ్ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ డిమాండ్ చేశారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పెద్దల కుట్ర పూరిత ఆదేశాలతోనే రాష్ట్రంలో పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, డివిజన్ల అధ్యక్షులు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, రావులపాటి మోజస్, రాకేశ్‌కుమార్, వై.శ్రీనివాస్, శ్యామ్యాదవ్, నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, శంకర్ ముదిరాజ్, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బండికి బుద్ధి చెప్పక తప్పదు
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి ప్రజలు బుద్ధి చెప్పక తప్పదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ వార్డు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి. శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కేసీఆర్‌ను చూసి మోడీ భయపడి తెలంగాణలో చిల్లర రాజకీయాలకు తెర దించారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవని ఆయన హెచ్చరించారు.
లీకేజీ ముమ్మాటికీ బీజేపీ కుట్ర
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఎదుర్కునే సత్తా లేక బీజేపీ నేతలు అడ్డదారులను వెతుక్కుంటున్నారని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, నార్నె శ్రీనివాస్‌రావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్‌తో కలిసి విప్ గాంధీ బుధవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పేపర్ లీకేజీ ముమ్మాటికీ బీజేపీ కుట్రేనని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీల వెనక ఎంతటి వారున్నా ప్రభుత్వం విడిచి పెట్టే ప్రసక్తే లేదన్నారు. నిరుద్యోగులే బీజేపీకి గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సంజీవరెడ్డి, దొడ్ల రామకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.
బీజేపీది రాక్షస క్రీడ : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
రాష్ర్టాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే బీజేపీ రాక్షస క్రీడ మొదలుపెట్టిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్ష పేపర్ లీకేజీ వెనుక బీజేపీ నేతల హస్తం ఉందన్నారు. నాలుగు ఓట్లు, రెండు సీట్ల కోసం ఇంత నీచానికి దిగడం బీజేపీ నిరంకుశత్వానికి పరాకాష్ట అని ఎమ్మెల్యే అభివర్ణించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాసరావు, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, భవాని ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పుట్టుక..బీజేపీలో వణుకు
రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నా రు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పుట్టుక బీజేపీలో వణుకు పుట్టించిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభ్వుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని ప్రశ్నా పత్రాలను లీక్ చేయడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో బండి సంజయ్‌కి, బీజేపీ నేతలకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర
యువతను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బండి సంజయ్ నీచ కుట్రలు పన్నారని హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి పుస్తె శ్రీకాంత్ తెలిపారు. బుధవారం ఆయన తన కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో బీజేపీ సెంటిమెంట్ ఆటలు మొదలు పెట్టిందన్నారు. పరీక్షా పేపర్లను తన అనుయాయులతో లీకేజీలు చేయిస్తూ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఢీకొనే సత్తాలేక పేపర్ల లీకేజీలకు పాల్పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఎవరు ఆటలాడినా చట్టం ముందు నిలబడాల్సిందేనని స్పష్టం చేశారు.
బండిని ఎవరూ క్షమించరు
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేందుకు బీజీపీ కుట్రకు తెరలేపిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆరోపించారు. బుధవారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజీపీ పక్కా ప్రణాళికతో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆశలతో ఆటాడుకుంటుందని విమర్శించారు. బీజేపీ తెలంగాణలో తమ ఆటలు సాగకపోవడంతో నీచమైన చర్యలకు పాల్పడుతోందని ఆయన మండి పడ్డారు. బండి సంజయ్‌ను తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించబోదని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అంబర్‌పేట, గోల్నాక, బాగ్‌అంబర్‌పేట, నల్లకుంట, కాచిగూడ డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.
అధికారం కోసం బీజేపీ అడ్డదారులు
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అలజడి రేపేందుకు పేపర్ లీకేజీలతో బీజేపీ మరో కుట్రకు తెరలేపిందని బహ్రెయిన్ ఎన్నారై బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీశ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బీజేపీ అగ్రనాయకత్వం చేసిన కుట్రలో భాగమే ఈ లీకేజీల వ్యవహారమని ఆయన అన్నారు. అధికారం కోసం అడ్డదారి తొకిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని అన్నారు.
– సతీశ్‌కుమార్, బహ్రెయిన్ ఎన్నారై బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు
పిల్లల భవిష్యత్‌తో బీజేపీ చెలగాటం
రాష్ట్రంలో మత చిచ్చు ప్రయత్నాలు ఫలించకపోవడంతో బీజేపీ తెలంగాణ బిడ్డల భవిష్యత్‌తో చెలగాటమాడే దుస్సాహసం చేస్తుందని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు. తెలంగాణాలో ఏనా డూ లేనంతగా ప్రజలని గందరగోళ స్థితికి తీసుకవస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇలాంటి చిల్లర ఎత్తుగడలతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
– గుర్రాల నాగరాజు, ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ బీఆరెస్ అధ్యక్షులు
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే పేపర్ లీకేజీ కుట్రకు బండి సంజయ్ తెరలేపారని టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు అన్నారు. తల్లిదండ్రులు ఆందోళనకు గురికావొద్దని, నిరుద్యోగులు, విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని సూచించారు. సీఎం కేసీఆర్ వద్ద బీజేపీ పుప్పులు ఉడకవని, ఇకనైనా చండాలపు రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. బండి సంజయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హత వేటు వేయాలని జగన్ డిమాండ్ చేశారు.
– పాటిమీది జగన్మోహన్ రావు, టీఎస్టీఎస్ చైర్మన్