సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): చైన్, సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు( Cell phone snatchers) పాల్పడు తున్న ముఠాను సౌత్‌ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్(Arrested) చేసి రూ. 11 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ సదేంద్ర కథనం ప్రకారం.. మాదన్నపేట్‌కు చెందిన ఎండీ మహ్మద్ షరీఫ్ అలియాస్ చోటు వృత్తిరీత్యా బైక్ మెకానిక్. 2014లోనే 10 వరకు సైదాబాద్ ప్రాంతంలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. 2015లో పీడీయాక్టు ప్రయోగించారు.
అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత బైక్ మెకానిక్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే వచ్చే జీతం తనకు విలాసవంతమైన జీవితానికి సరిపోకపోవడంతో తిరిగి దొంగతనాల బాట పట్టాడు. ఇందుకు సంతోష్‌నగర్‌కు చెందిన ఓలా డ్రైవర్‌గా పనిచేసే అబ్దుల్ గఫర్‌ను సంప్రదించాడు. ఇద్దరు కలిసి దొంగతనాలు చేయాలనుకొని ప్లాన్ చేశారు. పార్కు చేసిన బైక్‌లను దొంగిలించారు.
వాటిపై తిరుగుతూ గత జులై నెలలో వనస్థలిపురం, మలక్‌పేట్, లంగర్‌హౌస్, సరూర్‌నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాలలో ఒంటరి మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు, సెల్ఫోన్లు స్నాచింగ్‌లు చేశారు. దొంగతనాలు ఎక్కువవుతుండడంతో సౌత్ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, మలక్‌పేట పోలీసులు సంయుక్తంగా గాలించి ఇద్దరు స్నాచర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి బైక్, కారు, 51.50 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.