సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ మహానగరం తెల్లవారుజామునే ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన చార్మినార్‌కు కూతవేటు దూరంలో అగ్ని కీలలు 17 మందిని బలితీసుకున్నాయి. నిద్రలో ఉండగా.. దట్టంగా అలుమున్న పొగే విష వాయువుగా మారి ఆయువు తీసింది.
వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని వచ్చిన కుటుంబాలు…తిరిగి రాని లోకాలకు తరలివెళ్లాయి..పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ సమీపంలోని భవన అగ్నిప్రమాదంలో 17 మంది చనిపోవడం యావత్తు నగరాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ప్రధానంగా గుల్జార్ హౌస్ ఘటనలో పాపం ఎవ్వరిదీ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇరుకైన భవనాలు, భవనంలో కింద వ్యాపారాలు, పైన నివాసాలు…మరోవైపు ఇసుక వేస్తే రాలనంత జనం వెరసి ఏదైన ప్రమాదం జరిగితే దాని తీవ్రత ఎంత ఉంటుందో గుల్జార్‌హౌస్ వంటి ఘటన మరోసారి నిరూపితమైంది.
ఎంతో ఘన చరిత్ర
గుల్జార్ హౌస్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడ ముత్యాలు, గోల్డ్, బట్టలు, ఇతర వస్తువులకు చాలా ఫేమస్..డిమాండ్‌కు తగ్గట్టుగా ఇక్కడ వ్యాపారస్తులు ఏళ్ల తరబడి ఉన్న భవనాలకు కనీస మరమ్మతులు చేయరు. అంతేకాకుండా ఇబ్బడిముబ్బడిగా భవనంలో మార్పులు చేస్తారు. జీ+1, జీ+2 అంతస్థుల భవనాలే ఎక్కువగా ఉంటాయి. రెసిడెన్షియల్‌కు, కమర్షియల్లకు కానీ అనుమతులు తీసుకోరు. పాత భవనాలు ఐనప్పటికీ బిల్డింగ్ సామర్థ్య పరీక్షలు ఉండవు, కనీసం సెట్బ్యాక్లు, ఫైర్ ఎగ్జిట్లు లాంటివి అసలే పట్టవు. ఫలితంగా గుల్జార్‌హౌస్ వందల సంఖ్యలో వాణిజ్య వ్యాపారం సాగిస్తున్నారు.
చిన్న స్థలాల్లోనే కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టేయడంతో ఏదైన ప్రమాదాలు జరిగితే లోపలున్న వారు తప్పించుకుని బయటకు వెచ్చే అవకాశాలు తక్కువ. అందుకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆదివారం జరిగిన గుల్జార్‌హౌస్ వద్ద జరిగిన ఘటనలో ముత్యాలు అమ్మే షాపులుంటే మిగిలిన రెండో అంతస్తుల్లో నివాసముంటున్నారు.
షాపులను ఈ మధ్య చెక్కతో ఇంటీరియల్ డిజైన్లు చేయించినట్లు స్థానికులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో మొదలైన ప్రమాదం ఇంటీరియర్స్ అంటుకుని మం టలు వ్యాపించి ప్రమాద తీవ్రతను పెంచింది. గ్రౌండ్‌ఫ్లోర్ పైన ఉన్న రెండు అంతస్తులకు చేరుకునే మెట్ల కేవలం మూడు అడుగుల వెడల్పు మాత్రమే ఉండడం, ఒక మనిషి వెళ్తే మరో మనిషి వెళ్లలేని దుస్థితిలో ఇక్కడ చాలా షాపుల్లో నెలకొన్నాయి. వందల సంఖ్యల్లో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లపై ఆయా ప్రభుత్వ శాఖలు స్పందించి ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కండ్ల ముందు నిబంధనలు ఉల్లంఘిస్తున్న జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.