సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. భారీ వర్షాలకు రాంగోపాల్‌పేట డివిజన్లోని కాచిబౌలి, నల్లగుట్ట, జూలమ్మ టెంపుల్ తదితర ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరి నష్టపోయిన వారికి అండగా ఉంటామన్నారు. నేటి నుంచి(ఆదివారం) ఆయా ప్రాంతాల్లోని 1500 బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, కుర్మ హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, అరుణ గౌడ్, మల్లికార్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.