సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి చదువుకోడానికి, ఉద్యోగం కోసం, కూలీ పనులు చేసుకోడానికి వచ్చిన వారందరికి రూ.5కే భోజనం పెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన అన్నపూర్ణ క్యాంటీన్లు నేడు ఎంతో మంది ఆకలి తీర్చాయి. అలాంటిది ఏం ఉద్ధరించడానికి అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చి ఇందిరమ్మ పేరు పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంతో మంది పేదల ఆకలి తీర్చిన అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు మార్చడంపై గ్రేటర్‌లోని బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా ఒక్కసారిగా భగ్గుమన్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చొద్దంటూ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. కార్పొరేటర్లు నిర్వహించిన ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని, ఎమ్మెల్యే ముఠాగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మనం తినే భోజనాన్ని, రైతు పండించే ధాన్యాన్ని అన్నపూర్ణతో కీర్తిస్తుంటారు.
పేద ప్రజలకు తిండి పెట్టేందుకు కేసీఆర్ అన్నపూర్ణ క్యాంటీన్లను నెలకొల్పారు. గ్రేటర్‌వ్యాప్తంగా 150 క్యాంటీన్లను పెట్టి పేదవాడి కడుపు నింపారు. ఎంతో మంది పేదలకు రూ.5లకే కడుపు నింపారు. అలాంటి అన్నపూర్ణ క్యాంటీన్ పేరును తీసేసి ఇందిరమ్మ పేరు పెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకోవడం సిగ్గు చేటు. కేసీఆర్ హయాంలో 150 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు ఒక్క క్యాంటీన్ కూడా అదనంగా పెంచకుండా, 20కి పైగా క్యాంటీన్లు మూసేసింది. వాటిని తెరిపించకుండా పేర్లు మార్చే పనిపెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కనీసం ఆ ఆహారం నాణ్యత పరిశీలించకుండా, మరిన్ని కొత్తవి నెలకొల్పేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు.
ఒకవేళ పేరు మార్చే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి. 150 కార్పొరేటర్లలతో పాటు, ఎక్స్ అఫిషియో సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలి. కానీ అవేవీ చేయకుండానే సొంత నిర్ణయాలు తీసుకోవడం దేనికి సంకేతం. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకాలు ఏమైనా ఉంటే వాటికి ఆ పేరు పెట్టుకోండి. అంతేతప్ప ఎన్నోరోజులుగా పేదప్రజలకు పరిచయమైన పేరును మార్చితే ఊరుకోం. కావాలంటే మీ ఆరు గ్యారెంటీలకు ఆ పేర్లు పెట్టుకోండి. ప్రజలకు ఉపయోగపడే పథకాలకు పేర్లు మార్చకుండా అమలు చేయండి.
గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తే ఆ పేరు మార్చకుండా దాన్ని అమలు చేసిన ఘనత కేసీఆర్‌ది. వీలైతే ప్రస్తుతమున్న క్యాంటీన్లకు తోడు మారో 500 క్యాంటీన్లు ఏర్పాటు చేయండి. అమ్మవారి పేరైన అన్నపూర్ణ పేరును తీసేసి మీ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం సిగ్గుచేటు. వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రతి క్యాంటీన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తారు’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసనలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
అమ్మవారైన అన్నపూర్ణ పేరు తీసేసి ఇందిరమ్మ పేరు పెట్టడం దేనికి సంకేతమని బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. జీహెచ్ఎంసీ కార్యాలయ ప్రాంగణంలో ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ధర్నా ఉందని తెలుసుకున్న పోలీసు యంత్రాంగం అప్పటికే అప్రమత్తమై జీహెచ్ఎంసీ చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. కార్యాలయం లోపలికి వెళ్లాలంటే కూడా అనుమతి తీసుకొని వెళ్లాలంటూ హుకూం జారీ చేయడంతో కార్పొరేటర్లు పోలీసులను అడిగి లోపలికి వెళ్లారు.
అప్పటికే భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు గేట్ బయటే నినాదాలు చేస్తూ బైఠాయించారు. కేసీఆర్ గెలిపించిన మేయర్ ఇప్పుడు ఇందిరమ్మ నామస్మరణ చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ కూడా తన ఇంటిపేరు ఎనుములకు బదులు ఇందిరమ్మగా పెట్టుకోవాలంటూ ఎద్దేవా చేశారు. ఈ నిరసనలో కార్పొరేటర్లు సునీత, కవిత, భారతి, సామల హేమ, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.