హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఊహించిన దాని కంటే గొప్పగా బీఆర్ఎస్ పార్టీ సభ జరిగిందన్నారు. సభ విజయవంతం కావడానికి కృషి చేసిన జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఫుల్ జోష్..
గులాబీ పార్టీలో నూతనోత్సాహం ఉరుకలేస్తున్నది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా జరిగిన పార్టీ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో గ్రేటర్ గులాబీ శ్రేణుల్లో మరింత రెట్టింపు ఉత్సాహం నెలకొంది. గడిచిన కొన్ని రోజులుగా రజతోత్సవం నేపథ్యంలో సన్నాహక సమావేశాలతో నియోజవర్గాలను గులాబీ మయం చేసి హోరెత్తించారు. ఈ క్రమంలోనే ఎల్కతుర్తి సభకు భారీగా శ్రేణులు తరలివెళ్లారు.
పాతకేళ్ల పార్టీ ప్రస్థానం, పదేండ్ల పాలన, 16 నెలల కాంగ్రెస్ పాలన లోపాలపై కేసీఆర్ ప్రసంగించిన తీరును శ్రేణులను ఆకట్టుకున్నది. భవిష్యత్ పార్టీ కార్యాచరణపై పార్టీ అధినేత కేసీఆర్ శ్రేణులను దిశానిర్దేశం చేశారు. ఇదే జోష్తో మరింత ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్య నేతలు, శ్రేణులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ ప్రసంగంతో మరింత ఆత్మ విశ్వాసం పెరిగిందని, రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గులాబీ మయంగా వరంగల్ హైవే..
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లిన వాహనాలతో వరంగల్ హైవే గులాబీమయంగా మారింది. ఆదివారం ఉదయం నుంచి నగరంలోని నలుమూలల నుంచి వచ్చిన వాహనాలు ఉప్పల్ చౌరస్తా మీదుగా వరంగల్లో హైవేలోకి ప్రవేశించాయి. సభకు వెళ్లే వాహనాలతో ఉప్పల్ నుంచి భువనగిరి వరకు వాహనాలు బారులు తీరాయి. ఎటూ చూసిన హైవేపై జై కేసీఆర్ నినాదాలు మారుమోగాయి. వివిధ ప్రాంతాల నుంచి ఈ రూట్లో వరంగల్ సభవేదిక వద్దకు ప్రయాణం సాగించిన పార్టీ శ్రేణులు సాధారణ వాహనదారులకు ఎక్కడికక్కడ రూట్ క్లియర్ చేస్తూ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.వేల సంఖ్యలో వాహనాలతో ఈ హైవే కిక్కిరిసిపోవడంతో నెమ్మదిగా వాహనాలు ముందుకు కదుల్తూ వెళ్లాయి.