Gulzar House Incident | సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఫైర్ సిబ్బందికి సరైన వసతులు లేకపోవడంతో వేగంగా మంటలు ఆర్పేందుకు లోపలికి వెళ్లలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. ఘటనా స్థలికి వెళ్లేందుకు మెట్లు చిన్నగా ఉండడం, వెళ్లడానికి ఫైర్ సిబ్బంది ఇతర ఏర్పాట్లు చేశారు.
అలాగే ప్రధానంగా మంటలు, పొగ, ప్రమాదకరమైన గ్యాస్‌ల నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగించే బ్రీతింగ్ మాస్క్‌లు సరిగ్గా లేకపోవడంతో ఘటనా స్థలికి వెళ్లిన సిబ్బంది కొద్దిసేపు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటికి తోడు మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లలో నీరు కూడా లేదనే ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి కారణాలతో సహాయక చర్యలో ఆలస్యం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. అగ్నిప్రమాదం చిన్నదే అయినా పొగ ఎక్కువగా రావడంతోనే భారీగా ప్రాణ నష్టం జరిగింది.
నీటిని నింపడంలో ఆలస్యం.. ?
గుల్జార్ హౌస్‌లో 11 అగ్నిమాపక యంత్రాలు మంటలు అర్పేందుకు ఘటనాస్థలికి వచ్చాయి. అయితే ఇక్కడకు వచ్చిన అగ్నిమాపక వాహనాల్లో నీటిని నింపడంలో ఆలస్యం జరిగిందనే బాధిత కుటుంబాల నుంచి విమర్శలు వస్తున్నాయి. వేసవి కాలం కావడంతో నీటిని నింపుకోవడానికి ప్రయత్నించిన అగ్నిమాపక నియంత్రణ వాహనాల్లో అక్కడక్కడ నీటిని నింపేందుకు జలమండలి సిబ్బంది నిరాకరించారనే ఆరోపణలు వస్తున్నాయి.
రోబోను వాడాలనుకున్నారు..
గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదాన్ని నివారించేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు రోబోను వాడాలనుకున్నారు. అయితే రోబోను వాడేంతగా ప్రమాద తీవ్రత లేదని గుర్తించి దానిని తిరిగి వెనక్కి పంపించారు. గుల్జార్ హౌస్ ప్రమాద ఘటనకు షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదాన్ని గుర్తించేందుకు క్లూస్‌టీమ్ ఘటన స్థలికి వెళ్లినా భవనం పూర్తిగా దెబ్బతినడంతో లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
విద్యుత్ వాడకం పరిమితికి మించి వాడుతున్న క్రమంలోనే షార్ట్ సర్క్యూట్ సంభవించి ఉంటుందని ఇప్పటకే అధికార యంత్రం ఒక నిర్ధారణకు వచ్చింది. అగ్నిమాపక శాఖ వద్ద సరిపోయినన్ని మాస్క్‌లున్నాయి.. సరిపోయినంత నీళ్లు ఉన్నాయి.. ప్రమాదాన్ని బట్టి ఉపయోగించేందుకు అన్ని సదుపాయాలు ఉన్నాయని సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అఫీసర్ శ్రీదాస్ తెలిపారు. మంటల్లో చిక్కుకున్న వారిని మానవ సహాయం సరిపోకపోతే రోబోను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యాం..కానీ అక్కడ ప్రమాదం చిన్నదని.. అయితే పొగ ఎక్కువగా రావడంతోనే ప్రాణ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసు నమోదు
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై ఆదివారం చార్మినార్ పోలీస్ స్టేషన్లో మృతుల బంధువు ఉత్కర్ష్ మోడీ ఫిర్యాదు చేశారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు. 6:45 కు తన తండ్రి వినోద్మోడీకి సమీప బంధువు రోహిత్ ఫోన్ చేసి అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పారు.. తాము హుటాహుటినా వెళ్లి చూసేసరికి ఫైర్ సిబ్బంది సహాయకచర్యలో ఉన్నారన్నారు. 17 మంది అపస్మారక స్థితిలో ఉన్నవారిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్వచ్ఛందంగా వ్యాపారాలు మూసివేసి..
అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ పెరల్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం స్వచ్ఛందంగా తమ వ్యాపారాలను మూసివేసి సంతాపం ప్రకటించారు. చార్మినార్ సమీపంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీ, తలసాని తదితరులు హాజరయ్యారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కాపాడుకునేవాళ్లమేమో..?
ఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోగా, చికిత్సనందించే క్రమంలో 14 మంది ప్రాణాలు విడిచారు. విపరీతమైన పొగను పీల్చుకోవడం మాలంగా స్పృహ తప్పి పడిపోయి, అగ్నికి ఆహుతయ్యారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందించి ఉంటే కొద్దిమందినైనా కాపాడే ఆస్కారం ఉండేదంటూ.. పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెల్లవారుజామున వ్యాపించిన మంటల కారణంగా ఇంట్లోని వస్తువులన్నీ కాలుతుండటంతో ఒక్కసారిగా వాటి నుంచి వెలువడే పొగలో కార్బన్ మోనాక్సైడ్, స్మోక్ డస్ట్, అధిక ఉష్ణోగ్రత ఉండటం మూలానా వాటిని పీల్చిన వారందరూ ఆక్సిజన్ అందకపోవడంతో ఇబ్బందిపడ్డారు.
దట్టమైన పొగ కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. మంటలు మరింత ఎక్కువ కావడం మూలంగా వారి శరీరాలు దాదాపు 50 నుంచి 60 శాతం వరకు కాలిపోయాయని ఫోరెన్సిక్ వైద్యులు సైతం వెల్లడించారు. ఊపిరి పీల్చుకునేందుకు నరకయాతన పడుతున్న వారికి సత్వరంగా ఆక్సిజన్ అందిం ప్రాథమిక వైద్యమందించి ఉంటే మరణాల సంఖ్య తగ్గేదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఘటనాస్థలం నుంచి ఆసుపత్రులకు తరలించేవరకు అంబులెన్స్‌లలో అక్సిజన్ అందించి ఉంటే వారిలో కొంతమందినైనా కాపాడే ఆస్కారం ఉందంటూ స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఏడు అంబులెన్స్‌లు మాత్రమేనా..
అగ్నిప్రమాదం సంభవించగానే మొదట గోషామహల్ నుంచి ఒక్క అంబులెన్స్ మాత్రమే ఘటనాస్థలానికి చేరుకుంది. ఆ తరువాత ప్రమాద తీవ్రతను గ్రహించిన వైద్యశాఖ మరో 6 అంబులెన్స్‌లను ప్రమాద స్థలానికి చేర్చింది. ప్రమాదంలో 17 మందికి గాను ముగ్గురు అక్కడే మృతిచెందగా మిగతా 14 మందిని కేవలం ఏడు అంబులెన్స్‌ల్లోనే ఆసుపత్రులకు చేర్చారు. వాటిలో సైతం ఆక్సిజన్ లేదంటూ మృతుల బంధువులు ఆదివారం మంత్రి పొన్నంను నిలదీసిన విషయం తెలిసిందే. సకాలానికి ఆక్సిజన్ అందించినా..
కొందరైనా బతికేవారని వారు వాపోయారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో తరలించే సందర్భంలో కనీసం ఆక్సిజన్ మాస్క్ కూడా అందులో లేదని బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలిపి కన్నీరుమున్నీరయ్యారు.
సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
గుల్జార్‌హౌస్ వద్ద శ్రీకృష్ణ పెరల్స్ భవనంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనను తెలంగాణ మానవహక్కుల కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారని, భవన భద్రత, విద్యుత్ నిర్వహణ, అగ్ని ప్రమాద నివారణకు సంబంధించి నిబంధనలను పాటించలేదంటూ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ కేసు నమోదు చేసిందని టీజీహెచ్ఆర్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ, ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు ఈనెల 30వ తేదీలోగా అగ్నిప్రమాదంపై సమగ్ర నివేదిక సమర్పించాలని, తదుపరి విచారణ 30న ఉంటుందని పేర్కొన్నారు.
భిన్న ప్రకటనలతో అయోమయం
పాతబస్తీ గుల్జార్‌హౌస్ దగ్గర శ్రీకృష్ణ పెరల్స్ జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ క్రమంలో వివిధ శాఖలు ప్రమాదానికి గల కారణాలపై విభిన్నవాదనలు వినిపిస్తున్నారు. ఫైర్ విభాగం వారు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రకటించింది. అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రమాదం షార్ట్ సర్క్యూట్ ద్వారానే జరిగిందని, ఏసీ కంప్రెషర్ పేలిందని తెలిపారు. అయితే విద్యుత్ శాఖ మాత్రం అక్కడ షార్ట్ సర్క్యూట్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని చెప్పారు.
ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగితే ట్రాన్స్‌ఫార్మర్‌లో ఫీజులు కాలిపోవాలని, లేదా ఏబీకే కేబుల్స్‌లో అంతరాయం కనిపించాలని అవేవీ లేవని తాము గుర్తించినట్లు ఎస్పీడీసీఎల్ హైదరాబాద్ సౌత్ జోన్ ఎస్ఈ సోమిరెడ్డి తెలిపారు. అసలు ఫీడరే ట్రిప్ కాలేదని, పోలీసులు ఉదయం 7.28 గంటలకు ఫోన్ చేసిన తర్వాత తాము విద్యుత్ సరఫరా నిలిపివేశామని చెప్పారు.
విద్యుత్ మీటర్ దగ్గర ఫ్యూజ్ పోవడం, ఫీడర్ ట్రిప్ కావడం వంటి సమస్యలు తలెత్తలేదన్నారు. విద్యుత్ మీటర్ బాగానే ఉందని, ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగితే మీటర్లు కాలిపోవడం కానీ, ఫీడర్లు ట్రిప్ అవడం కానీ జరుగుతుందని, అలాంటి పరిస్థితులేవి, అగ్ని ప్రమాదం జరిగిన ఇంట్లో తాము గుర్తించలేదని ఎస్ఈ పేర్కొన్నారు. అయితే ఈ రెండు శాఖల ప్రకటనలతో ప్రస్తుతం అయోమయం నెలకొంది. మరోవైపు పోలీసుల దర్యాప్తులో కుటుంబ పరిస్థితులు, వారి మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా.. అసలు టెర్రస్ మీద ఉన్న వ్యక్తులు ఎటు పోయారు.
ఈ కోణంలో జరుగుపుతున్నట్లుగా తెలిసింది. కానీ ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున మంటలు రావడానికి అక్రమంగా తీసుకున్న కనెక్షన్ కారణమని, అక్కడ విద్యుత్ వైర్లపై లోడ్ ఎక్కువై మంటలు వచ్చాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు చేస్తున్న దర్యాప్తులో ఇప్పటికే కుటుంబసభ్యులను విచారించినట్లు తెలిసింది. వారి ద్వారా ప్రమాదానికి ముందురోజు ఏం జరిగింది.. ఆ రోజు ఉదయం మృతుల మొబైల్స్ నుంచి ఎవరెవరికి కాల్స్ చేశారు. అంతకుముందు వాళ్ల కాల్ లిస్ట్ కూడా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
అక్రమ కరెంటే కారణమా..?
ప్రహ్లాద్ ఇంటికి అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్నట్లు అగ్నిమాపక అధికారులు గుర్తించారు. నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్ నుంచి అక్రమంగా కరెంట్ తీసుకున్నట్లు చెబుతున్నారు. కొక్కేల ద్వారా కరెంట్ వైర్ వేసి హైటెన్షన్ వైర్ల నుంచి కరెంట్ తీసుకునే వారని దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారించారు. పెద్ద మొత్తంలో లోడ్ పడడం వల్ల మీటర్ వద్ద కరెంట్ ఓల్టేజీలో హెచ్చుతగ్గులు వచ్చి మీటర్ బాక్స్‌లో మంటలు వచ్చాయి.
మీటర్ బాక్స్ నుంచి పక్కనే ఉన్న చెక్క షో కేసుకు ముందుగా మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మంటల వ్యాప్తి వేగంగా జరిగినట్లు వారు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణం కాదంటూ మెట్రో సీఈ చక్రపాణి తెలిపారు. కానీ ఓల్టేజీలో వచ్చిన మార్పులతో వచ్చిన స్పార్క్స్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.