హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): నామమాత్రపు ధరతో ప్రభుత్వానికి భూమిని క్రమబద్దీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) ఉపసంహరించుకునేందుకు రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్లు మాజీ ఎంపీ కే కేశవరావు కుమారుడు వెంకటేశ్వరావు తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన జీ రఘువీర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారు. దీనిపై జస్టిస్ జే శ్రీనివాసరావు శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున లాయర్ ఈ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. రఘువీర్‌రెడ్డి ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని, కేవలం వాట్సాప్ మెసేజ్‌ల ఆధారంగా ఆయనపై ఈ కేసు నమోదు చేశారని తెలిపారు.
ఫిర్యాదులో సరైన అభియోగాలు ఉండాలని, మెసేజ్‌లను చూ సి బెదిరించినట్టు ఊహించుకుని కేసులు నమోదు చేసేందుకు చట్టం అనుమతించదని పేర్కొన్నారు. పిల్‌పై విచారణకు సంబంధించి ప్రచురితమైన వార్తా కథనాన్ని మాత్రమే పిటిషనర్ వాట్సాప్‌లో పంపారని, పత్రికలో ప్రచురితమైన కథనాన్ని పంపడం బెదిరింపు కాదని వివరించారు. భయపెడితే భయపడను. ఇదే విషయాన్ని హైకోర్టులో చెప్తానన్న వాట్సాప్ మెసేజ్‌లో బెదిరింపు ఏమున్నదని ప్రశ్నించారు. పిటిషన్ పలానా సమయానికి విచారణకు వస్తుందన్న మెసేజ్ సమాచారం అయి ఉండవచ్చని, అం దులో బెదిరింపు ఎకడ ఉన్నదని అడిగారు.
ఒకవేళ ఆ మెసేజ్‌లో బెదిరింపు ఉన్నట్టయితే పిటిషనర్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని మరుసటి రోజు విచారణ సందర్భంగా ప్రతివాది ప్రస్తావించి ఉండవచ్చని పేర్కొన్నారు. కేవలం పిటిషనర్ పంపిన వాట్సాప్ మెసేజ్‌లను చూపి బెదిరించారనడం చట్టప్రకారం చెల్లదన్నారు. వెంకటేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది ప్రభాకర్, మరో న్యాయవాది కృష్ణకుమార్‌గౌడ్ వాదనలు వినిపిస్తూ.. ఫిర్యాదుదారుని భూమి క్ర మబద్ధీకరణకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులపై దాఖలు చేసిన పిల్‌ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్ రూ.3 కోట్లు డిమాండ్ చేశారని, వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లే అందుకు ఆధారాలని తెలిపారు. అయితే విచారణను ఈ నెల 23కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.