బేగంపేట్, ఫిబ్రవరి 14: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ఈ నెల 17వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ భవన్ లో కేసీఆర్ జన్మదిన వేడుకల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17న పార్టీ శ్రేణులు మీమీ ప్రాంతాలలో KCR జన్మదిన వేడుకలలో భాగంగా కేక్ కటింగ్, పండ్ల పంపిణీ, ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు ఘనంగా జరపాలని చెప్పారు.
తెలంగాణ భవన్ లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులతో పాటు రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హాజరవుతారని వివరించారు.
వేడుకలలో కేక్ కటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, కేసీఆర్ జీవిత, రాజకీయ ప్రస్థానాన్ని వివరించేలా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ ని ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో జన్మదిన వేడుకలకు హాజరుకావాలని కోరారు. సమావేశంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మీ, టి. మహేశ్వరి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలను బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, అమీర్ పేట డివిజన్ ప్రధాన కార్యదర్శి సంతోష్ మణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.