ఖైరతాబాద్, నవంబర్ 21 : మహారాష్ట్రలో నివసిస్తున్న తెలంగాణ ప్రజల వెతలు పట్టించుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్‌బాబు కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు, వ్యాపారాలు తదితర అవసరాలతో ముంబైలో సుమారు 10 లక్షలకు పైగా తెలంగాణ ప్రజలు స్థిరపడ్డారన్నారు. వీరి కోసం అక్కడి పార్టీలు ప్రతిసారి ఎన్నికల సమయంలో హామీలు కురిపిస్తున్నాయి తప్ప.. ఆచరణలో ఆలసత్వం ప్రదర్శిస్తున్నాయన్నారు. ముంబై నుంచి తెలంగాణకు రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్నారు.
తెలంగాణ సాంస్కృతిక భవనం నిర్మించాలని, ముంబై విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పాటు చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న నాన్ లోకల్ సమస్యను పరిష్కరించాలన్నారు. ముంబై మిల్లు కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల నియమాలను సరళీకృతం చేయాలని, ముంబైలో యాదగిరి మినీ ప్రతిరూప దేవాలయం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం, అన్ని పార్టీలు చొరవ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షుడు సుభాష్ మచ్చ తదితరులు పాల్గొన్నారు.