బంజారాహిల్స్: చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యం అంటూ పేదలు నివాసం ఉంటున్న బస్తీలు, కాలనీల్లో హల్ చల్ చేస్తున్న హైడ్రా అధికారులు నగరం నడిబొడ్డున చెరువును అడ్డగోలుగా పూడ్చేస్తుంటే చోద్యం చూస్తున్నారా.. అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నం. 1లోని తాజ్ బంజారా చెరువును గతంలో హమీద్కుంట అని పిల్చేవారు. గుండ్ల చెరువుగా రెవెన్యూ రికార్డుల్లో ఉండే ఈ చెరువు చుట్టూ ఆక్రమణలు రాకుండా చూడడంతో పాటు వాకర్ల కోసం గత ప్రభుత్వ హయాంలో 900 మీటర్ల మేర వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని చేపట్టారు.
కాగా ఇటీవల బంజారాహిల్స్ రోడ్ నం. 1లోని శివాలయం పక్కన జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మొక్కలు నాటి పార్కుగా ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు చెరువులోని స్థలంలోకి చొచ్చుకుని వెళ్లి నిర్మాణ వ్యర్థాలు నింపి సుమారు 500 గజాల మేర చెరువును పూడ్చివేశారు. పదుల సంఖ్యంలో ట్రిప్పర్లతో భవన నిర్మాణ వ్యర్థాలు తీసుకువచ్చి చెరువులో పోయడంతో అసలే కబ్జాలతో నిండిపోయిన తాజ్ బంజారా చెరువు.. మరింత కుంచించుకుపోయింది.
జీహెచ్ఎంసీ పేరుతో సాగుతున్న చెరువు పూడ్చివేత వెనక స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తుల హస్తం ఉందని, తమ గేదెలను, ఆవులను పూడ్చివేసిన స్థలంలో ఉంచేందుకే ఈ పనిచేశారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు చెరువు ప్రారంభంలో సైతం అంబేద్కర్‌నగర్ బస్తీవైపు నాలాను ఆనుకొని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు చెరువులో మట్టి డంపింగ్ చేస్తున్నారు. గతంలో లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్‌తో పాటు మరికొన్ని నిర్మాణాల్లో కొంత భాగంగా తాజ్ బంజారా చెరువు బఫర్ జోన్లో ఉందని రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులు గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. అయితే ఇటీవల వారు సైతం చెరువులో వ్యర్థాలను పారవేస్తూ కాలుష్యానికి కారణంగా మారుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగి చెరువులో వ్యర్థాలను తొలగించాలని, చెరువును పూడ్చిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. తాజ్ బంజారా చెరువులోకి ఇష్టారాజ్యంగా డ్రైనేజీ నీరు వదులుతుండడంతో చెరువు మొత్తం కాలుష్య కాసారంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో మురుగునీటితో పాటు తీవ్రమైన దుర్వాసనలు వెదజల్లుతున్న తాజ్ బంజారా చెరువును శుభ్రం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, కొందరు లారీలు ద్వారా తాజ్ బంజారా చెరువులోకి ప్రవేశించి మట్టిని డంపింగ్ చేస్తున్నారని మంగళవారం రాత్రి సమాచారం అందుకున్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులు, జోనల్ కమిషనర్‌కి సమాచారం అందించారు. బంజారాహిల్స్ పోలీసులు దంపింగ్ చేస్తున్న రెండు ట్రిప్పర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.