ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 16 : ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల వైఖరి కారణంగా అనారోగ్యం బారిన పడి, హాస్పిటల్లో చేరి చికిత్స పొందిన విద్యార్థి మిట్టపల్లి హర్షకు అండగా నిలుస్తామని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. నిజాం కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న గోదావరిఖనికి చెందిన మిట్టపల్లి హర్ష వివిధ కోర్సుల ఫీజులను అశాస్త్రీయంగా పెంచడం, అధిక మెస్ బిల్లులు, ఇతర సమస్యలపై ఉద్యమిస్తుండడంతో హర్షను అకారణంగా కళాశాల నుంచి రెస్టిగేట్ చేశారని ఆరోపించారు.
దీనిపై హర్ష హైకోర్టును ఆశ్రయించగా తీర్పు అనుకూలంగా వచ్చిందని చెప్పారు.
అయినా ఓయూ ఉన్నతాధికారులు హర్షను మానసికంగా వేధించడంతో శుక్రవారం రాత్రి ఓఎస్డీ చాంబర్లో స్పృహ తప్పి పడిపోయారని పేర్కొన్నారు. అక్కడి నుంచి ఆర్టీసీ హాస్పిటల్కు తరలించి అక్కడ చేర్పించారని, అక్కడి నుంచి కింగ్ కోఠి హాస్పిటల్కు తరలించారని వివరించారు. చికిత్స అనంతరం విద్యార్థిని తీసుకుని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్యను కలిసి పరిస్థితి వివరించినట్లు తెలిపారు.
దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన ఓయూ అధికారులను మందలించి, విద్యార్థికి ఎలాంటి షరతులు లేకుండా కళాశాలలో చేర్చుకోవడంతో పాటు హాస్టల్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారని చెప్పారు. దాంతో పాటు అన్ని పరీక్షలు నిర్వహించాలని చెప్పారని పేర్కొన్నారు. భవిష్యత్తులో హర్షపై కక్షసాధింపు చర్యలకు దిగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గణేష్గౌడ్, అరవింద్, శివయాదవ్, శ్రవణ్, లక్ష్మణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.