బండ్లగూడలో 1501, పోచారంలో 1470
ఆన్లైన్లో దరఖాస్తు – లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక
అర్హులైన వారికి బ్యాంకు లోన్ సౌకర్యం
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పరిధిలోని నాగోల్ బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్లు విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సాధారణ పౌరులు, ఉద్యోగులు ఎవరైనా మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రత్యేక యాప్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. స్వగృహ ఫ్లాట్ల విక్రయంపై బుధవారం సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, స్వగృహ సీఈ ఈశ్వరయ్య, ఈఈ భాసర్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..
పేపర్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 30 రోజుల వరకు www.swagruha.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్లాట్లు కొనుగోలు చేసే వారిలో అర్హులకు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.వెయ్యి. ఈ మొత్తం నాన్ రిఫండబుల్. లబ్దిదారుల ఎంపిక లాటరీ పద్ధతిలో జరుగుతుంది.
అందుబాటులో మోడల్ హౌజ్‌లు..
కొనుగోలుదారుల కోసం నాగోల్ బండ్లగూడ, పోచారంలో ఆరు చొప్పున మోడల్ హౌజ్‌లు సైతం ఏర్పాటు చేశారు. ఆసక్తి కలిగిన వారి కోసం అకడికకడే దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బండ్లగూడలో మొత్తం 1501 ఫ్లాట్లు విక్రయానికి సిద్ధంగా ఉండగా, ఇందులో పనులు పూర్తయిన 419 ఫ్లాట్లకు రూ.3 వేలకు చదరపు అడుగు చొప్పున చెల్లించాలి. కొద్దిగా అసంపూర్తిగా ఉన్న 1082 ఫ్లాట్లు చ.అ.కు రూ.2750 చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పోచారంలో 1328 ఫ్లాట్లు రూ.2500 చొప్పున, కొద్ది స్థాయిలో అసంపూర్తిగా ఉన్న 142 ఫ్లాట్లు రూ.2250 చొప్పున విక్రయించనున్నారు.