మేడ్చల్, డిసెంబర్1 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల సర్వేను పూర్తి చేశారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ భూముల లెక్కను రెవెన్యూ యంత్రాంగం తేల్చినట్లు అధికారులు తెలిపారు. భూముల వివరాలను కేఎంఎల్ మ్యాప్(గూగుల్)లో పొందుపర్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా గత రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న 5,195 ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పుడు చేసిన సర్వే ప్రకారం అంతే లెక్కకు వచ్చిందా లేదా అన్నది అధికారుల నివేదికలో నిక్షిప్తమై ఉంది. అయితే గత రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న భూములకు ఇప్పుడు చేసిన సర్వేకు పొంతన లేకుండా ఉండటం వల్లే గోప్యంగా ఉంచుతున్నారు. కాగా ప్రభుత్వ భూముల్లో ఉన్న ఆక్రమణలను గుర్తించి నివేదికలను స్థానిక తహసీల్దార్లు సిద్ధం చేశారు.
సర్కారు భూములకు ఫెన్సింగ్..
జిల్లాలోని ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్‌లతో పాటు సూచిక బోర్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బోర్డుల ఏర్పాటుకు అయ్యే ఖర్చుల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గూగుల్ మ్యాప్‌లో పొందు పరిచేకంటే ముందే ఫెన్సింగ్ చేసి ప్రభుత్వ సూచిక బోర్డుల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే కబ్జాకు గురైన భూముల వివరాల నివేదికలను సిద్ధం చేసి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అందజేశారు.