మారేడ్‌పల్లి, డిసెంబర్ 28: ఒడిశాలోని కోరాపుట్ నుంచి మహారాష్ట్రకు రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రైల్వే ఇన్స్పెక్టర్ సాయిఈశ్వర్గౌడ్తో కలిసి రైల్వే డీఎస్పీ ఎస్ఎన్.జావెద్ కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బందా జిల్లా, బరగావ్ గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్(28), దీపక్ కుమార్(22) మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఓ గదిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటూ.. ప్లాస్టిక్ బాటిల్స్ సేకరణ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు.
అయితే మహారాష్ట్ర రత్నగిరి ప్రాంతానికి చెందిన మోహిత్ అనే వ్యక్తి గంజాయి అమ్మడం ద్వారా అధిక డబ్బులు సంపాదిస్తున్నాడని నిందితులు తెలుసుకొని ప్రధాన నిందితుడు అయిన మోహిత్‌ను కలిసి గంజాయిని రవాణా చేయడానికి అనుమతి కోసం అభ్యర్థించారు. ఇదే అదునుగా భావించిన మోహిత్ ఒడిశా నుంచి కళ్యాణ్ వరకు రైల్లో గంజాయిని తరలిస్తే.. రూ.1500 ఇస్తానని అరుణ్‌కుమార్, దీపక్‌లకు ఆశ చూపాడు. ఇందుకు వీరిద్దరూ అంగీకరించి.. ఈనెల 25వ తేదీన ప్రధాన నిందితుడు అయిన మోహిత్‌తో కలిసి నిందితులిద్దరూ కోరాపుట్ అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ 10 కిలోల ఎండు గంజాయిని రూ.20వేలకు కొనుగోలు చేశారు. అనంతరం ఈనెల 26వ తేదీన కోరాపుట్ నుంచి విశాఖపట్నంకు అందరూ కలిసి చేరుకున్నారు.
ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ రైల్లో అక్రమ రవాణా..
ఈనెల 26వ తేదీన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లలో నిందితులు అరుణ్‌కుమార్, దీపక్‌లు ఎండు గంజాయిని అక్రమంగా మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. తనకు చిన్న చిన్న పనులు ఉన్నాయని, నేను మహారాష్ట్రలోని కల్యాణి ప్రాంతంలో మిమ్మల్ని కలుస్తానని ప్రధాన నిందితుడు మోహిత్ నిందితులిద్దరికి చెప్పారు. ఇందులో భాగంగా రైలు ఈనెల 27వ తేదీన 2:15 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్ ఫారం నంబర్ 2కు చేరుకున్నది. నిందితులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగిన అనంతరం మరో రైల్లో మహారాష్ట్రకు వెళ్లాల్సి ఉన్నది. కాగా, ఈ సమయంలో రైల్వే ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ప్లాట్ ఫాంలను తనిఖీలు చేస్తుండగా.. నిందితులిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వద్ద ఉన్న బ్యాగ్‌లను చెక్ చేయగా.. అందులో గంజాయి ఉందని గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి 10.143 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితులు మోహిత్ పరారీలో ఉన్నాడు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ మజీద్, రైల్వే సిబ్బంది భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.