భానుడు భగభగ
భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఎండ సుర్రుమంటున్నది. నాలుగు రోజులుగా రోజురోజుకీ పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో పాటు రాత్రివేళ ఉక్కపోత కూడా నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
- రోజుకు ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- పైకి ఎగబాకుతున్న విద్యుత్ వినియోగం
- గ్రేటర్లో తొలిసారిగా శుక్రవారం 81.38 ఎంయూలుగా నమోదు
- ఎల్సీలు ఇవ్వకపోవడంతో శివారు ప్రాంతాల్లో విస్తరించని విద్యుత్ నెట్వర్క్
- భూగర్భజలాలు లేక జలమండలి సరఫరాపై తీవ్ర ఒత్తిడి
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 30 (నమస్తే తెలంగాణ): భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఎండ సుర్రుమంటున్నది. నాలుగు రోజులుగా రోజురోజుకీ పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో పాటు రాత్రివేళ ఉక్కపోత కూడా నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ నేపథ్యంలో కరెంటు వినియోగం కూడా నానాటికీ పైకి ఎగబాకుతున్నది.
రెండు, మూడు రోజులుగా గ్రేటర్ చరిత్రలోనే గరిష్ఠ విద్యుత్ వినియోగం నమోదవుతూ వస్తున్నది. దీనికి తోడు భూగర్భజలాలు ఇప్పటికే పాతాళానికి పడిపోవడంతో జలమండలి నీటి సరఫరాపైనే నగర జీవనం సాగుతున్నది. డిమాండుకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో చాలాచోట్ల జనం ఇబ్బందులు పడుతున్నారు. జలమండలికి ఉన్న వ్యవస్థతో పూర్తి సామర్థ్యం మేర సరఫరా చేస్తుండగా… మున్ముందు నీటి వినియోగం మరింత పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఆరంభంలోనే ఠారెత్తిస్తున్నాయి..
ఆరంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కేవలం పదిరోజుల వ్యవధిలోనే పగటి ఉష్ణోగ్రతలు దాదాపు పది డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. రోజుకు ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే నెల 20న 32.3 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న పగటి ఉష్ణోగ్రత 30వ తేదీ నాటికి సుమారు 41 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదైంది. దీంతో జనం ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా గత మూడు, నాలుగు రోజులుగానైతే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదే క్రమంలో రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా పెరుగుదల నమోదవుతుండటంతో రాత్రివేళ ఉక్కపోతతో జనం అవస్థలు పడుతున్నారు. శనివారం నుంచి కొంతమేర వడగాడ్పులు కూడా మొదలయ్యాయి. ఇవి మరింత తీవ్రమైతే జనం మరింత ఇబ్బందిపడే ప్రమాదముంది.
ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉండటంతో గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగం కూడా నానాటికీ పెరుగుతున్నది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రికార్డు స్థాయిలో వినియోగం నమోదవుతున్నది. నాలుగైదు రోజుల కిందట మే నెలలో నమోదయ్యే వినియోగం స్థాయికి చేరుకున్న విద్యుత్ డిమాండు.. ఇప్పుడు అంతకుమించి అన్నట్లు పైకి ఎగబాకుతున్నది. ఈ నెల 29న 79.78 మిలియన్ యూనిట్లుగా ఉన్న వినియోగం… శనివారం ఏకంగా 81.39 మిలియన్ యూనిట్లకు చేరుకొని… తొలిసారిగా 80 మిలియన్ యూనిట్ల మార్కును దాటేసింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి కూడా శనివారం విద్యుత్‌పై సమీక్ష నిర్వహించారు.
అయితే ఎల్సీల మాటున కొందరు ఉద్దేశపూర్వకంగా కరెంటు కోతలు విధిస్తున్నారంటూ ప్రభుత్వం ఎల్సీల అనుమతిని నిలిపివేసింది. దీంతో శివారు ప్రాంతాల్లో కొత్త లైన్ల ఏర్పాటు అనేది సమస్యగా మారింది. శివారు ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు దాదాపుగా నిలిచిపోయింది. అక్కడ జనం అవస్థలు పడుతున్నారు. వారికి కరెంటు సరఫరా ఇవ్వాలంటే ఫీడర్ మొత్తం ఎల్సీ తీసుకోవాల్సిన పరిస్థితి. దీంతో విడవమంటే పాముకు… కరవమంటే కప్పకు అన్నట్లుగా అధికారుల పరిస్థితి తయారైంది. వడగాడ్పులు తోడైతే ఉష్ణోగ్రతలు మరింత పెరిగి కరెంటు వినియోగం ఇంకా పెరిగే అవకాశాలున్నా.. విద్యుత్ వ్యవస్థ విస్తరణ అనేది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
కత్తి మీద సాములా నగర నీటి సరఫరా…
నగరంలో జలమండలి నీటి సరఫరా అనేది కత్తి మీద సాములా మారుతున్నది. వాస్తవానికి జలమండలి వివిధ నీటి వనరుల ద్వారా సరఫరా చేసే నీటి పరిమాణం ఇంతకంటే పెరిగే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు సామర్థ్యం పెంపు అనేది కూడా సాంకేతికంగా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సరఫరా సామర్థ్యం ఇదేవిధంగా కొనసాగించడమనేది కూడా ఒక సవాల్‌గానే ఉన్నది. ముఖ్యంగా ఎల్లంపల్లి జలాశయంలో నీటి నిల్వ అనేది ఆందోళనకరంగానే ఉన్నది. అయితే నగరంలో ఇప్పటికే బోర్లు ఎండిపోయిన నేపథ్యంలో జలమండలి సరఫరా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నది. శివారు ప్రాంతాల్లో ప్రైవేటు ట్యాంకర్లు ఇప్పటికీ ఓ మోస్తరుగా జనాన్ని ఆదుకుంటున్నాయి. కానీ ఆ బోర్లు కూడా ఒట్టిపోయినట్లయితే పరిస్థితి మరింత జఠిలంగా మారుతుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

