సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): వేసవి కాలం వచ్చేస్తోంది. కరెంట్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికతో పనులు ముగించడానికి దక్షిణ డిస్కం సిద్దమైంది. ఇప్పటికే చాలాచోట్ల చిన్నచిన్న పనులు పూర్తి చేశారు. అయితే ప్రధానమైన పనులు మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో పెట్టిన పనుల్లో అధిక ఒత్తిడి తట్టుకునే 33కేవీ పనులు గత సంవత్సరం నుంచే పెండింగ్‌లో పడ్డాయి. అయినప్పటికీ ఈ సంవత్సరం గత పనులు వదిలేసిన డిస్కం మరో కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో శివారు ప్రాంతాల్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా జరిగే చోట్ల పనులకు టెండర్లు పిలిచింది.
ఇందులో 11కేవీ, 33కేవీ పనులు ఉండగా, వాటిలో గతేడాది 33కేవీకి సంబంధించిన కేబుల్ సరఫరా చేయకపోవడంతో పనులే మొదలుపెట్టలేదు. ఒకవైపు అత్యవసర పనుల కింద గతేడాది పనులు అలాగే పెండింగ్‌లో ఉండగా, ఈసారి కూడా సమ్మర్ ప్లాన్ అంటూ 33 కేవీ పనులకు సుమారు రూ.20కోట్ల మేర టెండర్లు పిలిచారు. అయితే ఈసారి కూడా కేబుల్ సరఫరా సమస్యగా మారుతుందని, ఈ విషయంలో అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే ఎస్పీడీసీఎల్ అధికారులు మాత్రం తమ పరిధిలోని మూడు జోన్లలో కేవలం పీటీఆర్, డీటీఆర్‌ల బిగింపు వంటి పనులను తమకు నచ్చిన వారికి నామినేషన్ పద్ధతిలో ఇచ్చి సకాలంలో యాక్షన్ ప్లాన్ పూర్తయినట్లు చెప్పుకొంటున్నారంటూ మింట్‌కాంపౌండ్‌లో చర్చ జరుగుతోంది.
ఈ సంవత్సరం సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో చిన్నచిన్న పనులు పూర్తిచేశామని, అంతేకాకుండా పలుచోట్ల డీటీఆర్లు, పీటీఆర్లు బిగించామని డిస్కం అధికారులు చెప్పుకొంటున్నారు. అయితే విద్యుత్ వినియోగం ఈసారి 100 ఎంయూలు దాటే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా ఒత్తిడిని తట్టుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కేబుల్ వర్క్స్‌లో భాగంగా ఈసారి సుమారు రూ.20కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. అందులో భాగంగా 11కేవీ పనుల్లో జీడిమెట్ల టు పోచారం సబ్‌స్టేషన్, జవహర్‌నగర్ ఫీడర్ నుంచి మౌలాలి, స్టేట్‌హోం నుంచి కల్యాణ్‌నగర్, 33కేవీ పనుల్లో బైరామల్‌గూడ ,సాహెబ్‌నగర్ కలాన్ సబ్స్టేషన్లు, అబ్దుల్లాపూర్‌మెట్, కొత్తపేటలలో ఫీడర్ పనులు చేపట్టడానికి సమ్మర్యాక్షన్ప్లాన్లో ప్రతిపాదనలు పెట్టి టెండర్లు పిలిచారు. అయితే వీటికి సంబంధించి 11కేవీ పనులు జరిగే అవకాశమున్నప్పటికీ , 33కేవీ మాత్రం జరుగుతాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో అధికారులు సైతం ఏం చెప్పలేకపోతున్నారు. తమకు కూడా యాజమాన్యం నుంచి ఎలాంటి సమాచారం లేదని, సమ్మర్ ప్లాన్‌లో భాగంగా పిలవమంటే పిలిచామని అంతే తప్ప.. సామగ్రికి సంబంధించిన వ్యవహారం కార్పొరేట్ ఆఫీసుకే తెలుస్తుందని ఓ ఏడీఈ చెప్పారు.
గతేడాది పనులు మొదలేకాలేదు..!
గత సంవత్సరం పిలిచిన రూ.18కోట్ల విలువైన పలు రకాల పనులకు సంబంధించిన టెండర్లు ఖరారు చేసి, అగ్రిమెంట్లు చేసిన డిస్కం యాజమాన్యం ఆ తర్వాత కేబుల్ సరఫరాలో కమిషన్ల గొడవ రావడంతో కేబుల్ కొనకుండా పనులు ఆపేసింది. పనులు ఎప్పుడు చేద్దామంటూ కాంట్రాక్టర్లు అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకు చెబుతూ సంవత్సర కాలం సాగదీసింది. మధ్యలో కేబుల్ ఎవరి పనులకు వాళ్లే తెచ్చుకోవాలంటూ చెప్పినప్పటికీ టెండర్ నిబంధనల ప్రకారం కేబుల్ సరఫరా చేయాల్సిన డిస్కం కాంట్రాక్టర్లనే తెచ్చి పనులు చేయమనడంతో ధర దగ్గర ఇరువర్గాలకు కుదరలేదు. దీంతో పనులు నిలిపేశారు.
ఆ తర్వాత 42 కి.మీ. కేబుల్ కొని మూడు సబ్స్టేషన్లకు ఆరు కిలోమీటర్ల కేబుల్ ఇచ్చి పనులు చేయించారు. ఆ సబ్స్టేషన్లలో కేబుల్ వేసినప్పటికీ ప్యానల్ బోర్డులు లేక ఆ పనులు కూడా నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే గత సంవత్సరం సమ్మర్ యాక్షన్ ప్లాన్ అత్యవసరపనులంటూ చెప్పి టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు చేసుకున్న డిస్కం కాంట్రాక్టర్లు కట్టిన ఈఎండీలు సుమారుగా కోటిన్నర వరకు తమ దగ్గరే పెట్టుకున్నదని, తాము కట్టిన లక్షలు లక్షలు డిస్కంలోనే మూలుగుతున్నాయని, పనులు మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదని కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతుంటే ఈ పనులు జరగకపోవడంతో గత సంవత్సరం కరెంట్ సరఫరాలో తీవ్ర అంతరాయాలేర్పడ్డాయని అధికారులు చెబుతున్నారు.
వినియోగం పెరిగితే కష్టమే..!
ఈసారి విద్యుత్ వినియోగం అత్యధికంగా జరిగే అవకాశమున్నట్లు విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం 90ఎంయూ చేరిన వాడకం ఈసారి సుమారు 100ఎంయూ దాటుతుందని ప్రతీ సమావేశంలో అధికారులు, సిబ్బంది చర్చిస్తున్నారు. గతం కంటే కనెక్షన్లు ఐదు లక్షలు పెరిగాయని, అంతేకాకుండా శివారు ప్రాంతాల్లో వాడకం చాలా పెరిగిందని ఈ మేరకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులు ఈ నెలాఖరులోగా పూర్గిచేయాలని సీఎండీ ముషారఫ్ అధికారులను ఆదేశించారు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అసలు వినియోగం పెరుగుతుంటే ఆ ఒత్తిడిని తట్టుకునే కెపాసిటీ కలిగిన 33కేవీ కేబుల్ పనులు మాత్రం యాక్షన్‌ప్లాన్‌లో పెట్టి అమలులో మాత్రం మొదలు పెట్టకపోవడంతో అధికారులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మర్లో సరఫరాలో వచ్చే సమస్యలు తట్టుకోవాలంటే కేబుల్ పనులు చేస్తేనే కొంత మేరకు ప్రయోజనంగా ఉంటుందని ఎస్పీడీసీఎల్కు చెందిన ఒక సీనియర్ విద్యుత్ ఇంజినీర్ చెప్పారు. కానీ ఇప్పటివరకు స్టోర్స్‌లో కావలసినంత కేబుల్ లేదని, అది రావాలంటే పెద్ద స్థాయిలో అన్నీ సెటిల్ కావాలని ఆయన వ్యాఖ్యానించారు. గత సంవత్సరం పనులు మొదలే కాకపోగా ఈ సంవత్సరం మళ్లీ పనులు పిలవడంతో ఏం చేయాలా అని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ మేరకు దక్షిణ డిస్కం అధికారులు ప్రణాళికను ఎలా అమలు చేస్తారా అనే కోణంలో టీజీఎస్పీడీసీఎల్లో చర్చ జరుగుతోంది.