వెంగళరావునగర్, ఏప్రిల్ 7 :కాయకష్టం చేసుకుని జీవించే వలస కూలీ జీవితంపై విరక్తి చెందాడు. ఆర్టీసీ బస్సు చక్రాల కింద తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన జీనుగ బీరప్ప(65) వలస కూలీగా పని చేస్తున్నాడు. 20 ఏండ్ల క్రితం యూసుఫ్‌గూడకు ఒంటరిగా వచ్చి జానకమ్మతోటలోని ఇసుక వ్యాపారి వద్ద కూలీగా పని చేస్తున్నాడు.
రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బుతో 20 రోజులకోసారి ఊరికెళ్లి తన కుటుంబాన్ని కలిసి వచ్చేవాడు. పగలంతా కష్టం చేసుకుని ఇక్కడి బస్టాప్, ఫుట్ పాత్‌లపైనే నిద్రంచేవాడు. ఈ క్రమంలోనే మద్యానికి అలవాటయ్యాడు. ఈ నేపథ్యంలో అందరూ చూస్తుండగా మిట్టమధ్యాహ్నం వేళ ఫరూక్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు ఎదురెళ్లి నిల్చొన్నాడు.
గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ బ్రేక్ వేశాడు. తిరిగి బస్సు కదిలే వేళ అకస్మాత్తుగా బీరప్ప ఆర్టీసీ బస్సు వెనుక కుడి వైపున చక్రాల కింద తల పెట్టడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడి సీసీటీవీ ఫుటేజీలో ఆత్మహత్య దృశ్యాలు రికార్ట్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బీరప్ప మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.