Revanth Reddy | ముషీరాబాద్, ఫిబ్రవరి 28 : పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) డిమాండ్ చేసింది. శుక్రవారం విద్యానగర్‌లోని వివేకానంద డిగ్రీ కాలేజ్, ఏఆర్కే డిగ్రీ కాలేజీ విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డికి ఫీజు బకాయలు విడుదల చేయాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సామూహిక లేఖలు రాశారు.
ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపొంగి నాగరాజు, గ్రేటర్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంద నవీన్, కె శ్రీనివాస్‌లు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలు నుంచి పెండింగ్‌లో ఉన్న 8 వేల కోట్ల పైచిలుకు స్కాలర్షిప్స్, రియింబర్స్‌మెంట్ విడుదల చేయాలని, రాష్ట్రంలో వెంటిలేషన్‌పై ఉన్న ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలంటే బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా రంగం సంస్థలలో నిధుల కొరతతో మౌలిక వసతులు లేక విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియింబర్స్‌మెంట్ ఇస్తామని హామీ ఇచ్చి విస్మరిస్తుందని ఆరోపించారు. ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామని, మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌ని ఏర్పాటు చేస్తామని చెప్పి విద్యా వ్యవస్థను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా రంగంలో ఎక్కువ శాతం చదివేది బడుగు బలహీన వర్గాల విద్యార్థులే.. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం అంటే పేద విద్యార్థులను విద్యకు దూరం చేసినట్టే అన్నారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 8 వేల కోట్ల పైచిలుకు ఫీజు బకాయిలను విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఉపాధ్యక్షులు గడ్డం గౌతం, సహాయ కార్యదర్శులు అసిఫ్, తీగల శ్యామ్, మౌనిక, జాహ్నవి, అనూష తదితరులు పాల్గొన్నారు.