సిటీ బ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల్లో కాంగ్రెస్ సర్కార్ చేసిన విధ్వంసాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పు పట్టడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ భూముల్లో పర్యావరణం, జీవవైవిధ్యం పరిరక్షణకు తాము చేస్తున్న ఉద్యమం ఫలితాన్నిచ్చిందని అన్నారు. ప్రభుత్వం ఇకనైనా పర్యావరణ విధ్వంసాన్ని మానుకోవాలని సూచించారు.
ప్రభుత్వ సంస్థలు, జీవవైవిధ్యాన్ని సంరక్షించాల్సిన ప్రభుత్వం వాటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే ఇలాంటి పరాభవమే ఎదురవుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారం ఉందని నిబంధనలకు విరుద్ధంగా పాలన సాగిస్తామంటే న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోదని హితవు పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో సుదీర్ఘకాలంగా వస్తున్న సంపదను కొల్లగొట్టాలనుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఇప్పటికైనా సుప్రీం కోర్టు సూచించినట్లు చెట్లను తెగనరికిన ప్రాంతంలో పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌కు గ్రీన్ లంగ్ స్పేస్‌గా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని కోరారు. హెచ్‌సీయూ ప్రాంతాన్ని గ్రీన్ జోన్‌గా ప్రకటించి, సంరక్షించాలని అన్నారు.
పునరుద్ధరణ పనులు చేపట్టాలి
కంచ గచ్చిబౌలి అటవీ భూముల విషయంలో సుప్రీం కోర్టు విచారణ తీరుపై సంతోషం వ్యక్తం చేస్తున్నా. గతేడాది హెచ్‌సీయూలో వనమహోత్సవం పేరుతో వందల ఎకరాల్లో చెట్లను నరికేసి అశాస్త్రీయ మొక్కలను (అటవీ చెట్లు కానివి, జంతు ఆవాసానికి, ఆహారానికి ఉపయోగపడనివి) నాటారు. అయితే సుప్రీం కోర్టు చెప్పినట్లు అటవీ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. పర్యావరణవేత్తల సలహాలు, సూచనలతో పునరుద్ధరణ పనులు చేపట్టాలి. అడ్మినిస్టేష్రన్ విభాగం సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలి. – ప్రవీణ్ కుమార్ సాకే, రీసెర్చ్ స్కాలర్, బయోడైవర్సిటీ క్లబ్ ఫౌండర్, హెచ్‌సీయూ
అసత్య ప్రచారాలను మానుకోవాలి
కాంగ్రెస్ సర్కార్‌కు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నాం. సుప్రీం విచారణ తీరు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటింది. 400 ఎకరాల్లో జింకలు, నెమళ్లు, అటవీ మొక్కలు లేవని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఇప్పటికైనా మానుకోవాలి. హైకోర్టు రిజిస్టార్,్ర సీఈసీ ఇచ్చిన నివేదికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను ఏవిధంగా ఉల్లంఘిస్తున్నదో తేటతెల్లమైంది. ఇప్పటికైనా 1975లో హెచ్సీయూకు కేటాయించిన భూములన్నీ రిజిస్టేష్రన్ చేయించాలి. న్యాయబద్ధంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను కొట్టేయాలి.
– తుంగ రమేశ్, డీఎస్‌యూ ప్రెసిడెంట్,హెచ్‌సీయూ
మా పోరాటానికి తొలి విజయం
హెచ్‌సీయూ భూముల విచారణలో సుప్రీం కోర్టు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టడం.. విద్యార్థులు, ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది, పర్యావరణవేత్తలు, ఎన్జీవోలు, మీడియా, సోషల్ మీడియా చేసిన అవిశ్రాంత ఉద్యమానికి తొలి విజయం. మా పోరాటాన్ని గుర్తించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందించిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు. కాంగ్రెస్ సర్కారు అనుకూల శక్తులు యూనివర్సిటీ భూములపై చేస్తున్న అసత్య ప్రచారాలను ఇకనైనా మానుకోవాలి. ప్రకృతి సంపదను ధ్వంసం చేయాలని చూస్తే ఫలితం ఇలానే ఉంటుంది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు.
– ఆర్ వేణు, రీసెర్చ్ స్కాలర్, హెచ్‌సీయూ