సుల్తాన్‌బజార్: నిజాం కళాశాలలోని గర్ల్స్ హాస్టల్‌ను పూర్తి స్థాయిలో యూజీ విద్యార్థినులకే కేటాయించాలంటూ.. శనివారం చింతచెట్టు వద్ద ప్లకార్డులతో విద్యార్థినీ, విద్యార్థులు నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి తమలాంటి నిరుపేదలకు హాస్టల్‌ను కేటాయించాలని నాలుగు రోజులుగా మౌనంగా నిరసన తెలుపుతున్నా.. ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని విద్యార్థునులు ఆరోపించారు. కాగా, నిరసన తెలుపుతున్న విద్యార్థులతో మాట్లాడిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ భీమా..
ఈ ఏడాది హాస్టల్ కోసం 217 మంది దరఖాస్తు చేసుకోగా, 130 మందికి వసతి కల్పించినట్లు తెలిపారు. యూజీ ద్వితీయ, తృతీయ సంవత్సరం కలిపి 300 మంది, పీజీకి చెందిన 155 మంది విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పించినట్లు చెప్పారు. అయితే ప్రిన్సిపాల్ తెలిపిన వివరాలకు విద్యార్థులు సమ్మతించలేదు. పూర్తి స్థాయిలో యూజీ విద్యార్థినులకు హాస్టల్ వసతి కేటాయించేంత వరకు తమ పోరాటం ఆగదని భీష్మించుకూర్చున్నారు.