సిటీబ్యూరో, ఫిబ్రవరి27 (నమస్తే తెలంగాణ): జ్ఞానం కోసం చదువుకోవడం ఒకప్పటి మాట. మార్కులు, ర్యాంకుల కోసమే చదువుకోవాలనేది నేటి మాట. ఏడాదంతా ఆనందంగా గడిపిన విద్యార్థులు పరీక్షలనేసరికి ఒత్తిడికి గురవుతుంటారు. వారి చేష్టల ద్వారా తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ తరహా స్వభావం ప్రతి ఏడాది చూస్తూనే ఉన్నాం. అనేక మంది విద్యార్థులు ర్యాంకులంటూ పరిగెత్తి మానసికంగా కుంగిపోవడం గమనిస్తూనే ఉన్నాం. పరీక్షలు దగ్గరపడుతున్న వేళ విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని దూరం చేస్తూ కింగ్‌కోఠిలోని మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ నివేదిత సామలతో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
కొందరు విద్యార్థులు రోజులో అధిక గంటలు చదువుతూనే ఉంటారు. ర్యాంకులు, మార్కుల కోసం తిండి, నిద్రమాని మరీ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. మనిషికి పగలు ఎంత ముఖ్యమో.. రాత్రి కూడా అంతే ముఖ్యం. రాత్రి వేళల్లో నిద్రించగానే మానవుడి మెదడు మెమరీ కన్సాలిడేషన్లోకి వెళ్తుంది. విద్యార్థి కష్టపడి చదివినదంతా రాత్రి పడుకున్నాక జ్ఞాపక శక్తి గట్టిపడి గుర్తుండేలా చేస్తుంది. అందుకే తప్పనిసరిగా రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర అవసరం.
యోగా చేయండి..
చదువుతున్నాం.. కానీ, గుర్తుండటం లేదనే సమస్యతో అనేక మంది తమలో తామే బాధపడుతుంటారు. అదంతా వారి అపోహ మాత్రమే. ఎంత చదివినా మనిషికి గుర్తుండేది 80 శాతం మాత్రమే. నిరంతరం చదవడమే కాకుండా కాసేపు మ్యూజిక్ వినడం, కాసేపు మైదానంలో ఆటలు ఆడటం, యోగా, వ్యాయామాలు చేయడం వల్ల కూడా చదివింది గుర్తుంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సెల్‌ఫోన్ గంటకు మించి వాడినా వ్యసనంగా మారి మిమ్మల్ని నాశనం చేస్తుంది.
పరీక్షల సమయంలోనే అధికం..
పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక సమస్యలతో బాధపడుతూ వైద్యులను సంప్రదిస్తుంటారు. సాధారణ రోజుల్లో నెలకు 150 నుంచి 180 మధ్యలో వస్తే, పరీక్షల సీజన్లో మాత్రం 200 మందికి పైగా వస్తుంటారు. గతేడాది ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ జిల్లాలోని 178 పాఠశాలలకు వెళ్లి గైడెన్స్ ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు సాధించగలిగాం.
ఆ మూడు గంటలు మీవే…
లోపల ఉండే భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా పరీక్షా కేంద్రంలోకి వెళ్లండి. మూడు గంటలు ప్రశాంతంగా పరీక్షలు రాయండి. ముందుగా పరీక్షా పత్రాన్ని ఒక పది నిమిషాలు ఓపికతో చదవండి. ఆ క్షణంలో మీ మెదడు వాటికి సంబంధించిన జవాబులను మీకు అందిస్తుంది. ఆ తరువాత మీకు తెలిసిన జవాబులు ముందు రాసి, రానివి ఆ తరువాత రాయండి. అన్నింటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేయండి.