ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ప్రదర్శనలు, నిరసనలు నిర్వహించకూడదని అధికారులు జారీచేసిన సర్య్కులర్ పై ఓయూలో ఆగ్రహ జ్వాల వెల్లువెత్తింది. అన్ని విద్యార్థి సంఘాలు ఖండించాయి. ఓయూ వీసీ చర్యలను నిరసిస్తూ వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వామపక్ష, దళిత, గిరిజన, బహుజన, ప్రజాస్వామ్య, అధికార, ప్రతిపక్ష పార్టీల విద్యార్థి సంఘాల నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సర్య్కులర్ను వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఓయూ విద్యార్థి నేతలు చటారి దశరథ్, జీడీ అనిల్, జంగయ్య, రాజేశ్ (బీఆర్ఎస్వీ), ఎస్.నాగేశ్వర రావు ఆర్.ఎల్ మూర్తి, ఉదయ్ (ఎస్ఎఫ్ఐ) దివాకర్ (ఏఎస్ఏ), శ్రీకాంత్ (ఓయూ జేఏసీ) తదితరులు పాల్గొన్నారు.
కాగా, సర్య్కులర్ పత్రులను ఏబీవీపీ నేతలు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో దహనం చేశారు. ఇదిలాఉంటే విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులు హరించేలా ఉన్న సర్య్కులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ తుంగబాలు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండగాని కిరణ్ గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జీడీ అనిల్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేశ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య , జార్జి రెడ్డి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు, ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షుడు నామ సైదులు, యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (కాంట్రాక్ట్) – తెలంగాణ స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరశురాం తదితరులు డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎటువంటి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించకూడదని అధికారులు జారీ చేసిన సర్య్కులర్పై సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్న తరుణంలో వర్సిటీ ఉన్నతాధికారులు వెనక్కి తగ్గారు. యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం నిరసనలు నిషేధించలేదని స్పష్టం చేశారు.