ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 1: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించతలపెట్టిన ఉన్నత విద్యా మండలి ఎదుట ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజాము నుంచే ఓయూ హాస్టల్ గదుల్లోకి ప్రవేశించిన ఖాకీలు విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాకు సిద్ధమవుతుంటే.. హాస్టల్ గదుల్లోకి చొరబడి మరీ ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను గాలికొదిలేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీల అనుమతులను రద్దు చేయాలని, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో టీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, అంసా ఓయూ అధ్యక్షుడు సైదులు, ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఉదయ్ కుమార్, టీడీఎస్ఎఫ్ అధ్యక్షుడు విజయ్ నాయక్, బీసీ విద్యార్థి సంఘం నేత లింగయ్య యాదవ్, పీడీఎస్యూ నాయకుడు మంద నవీన్, టీఎస్పీ నేత మధుయాదవ్ తదితరులు ఉన్నారు. కాగా విద్యార్థుల అరెస్టులను తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన (టీఎన్వీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు టీకే శివప్రసాద్, ఎంఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు నాగరాజు తీవ్రంగా ఖండించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వారు స్పష్టం చేశారు.