సిటీ బ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: గ్రేటర్ పరిధిలో అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యం నగర ప్రజల పాలిట శాపంగా మారుతున్నది. నాలాలు, డ్రైనేజీలు, మ్యాన్‌హోళ్లు, రోడ్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో అమాయకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నగరంలో తరచూ జరుగుతున్న ఘటనలు ఈ మూడు శాఖల మధ్య సమన్వలోపాన్ని బట్టబయలు చేస్తున్నాయి.
ప్రజలకు మేలు జరిగే ఘటనలు జరిగినప్పుడు క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు తహతహలాడుతున్న అధికారులు.. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం బాధ్యత తీసుకోకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పూడికతీత పనులకు కూడా తామే చేశామంటూ గొప్పగా చెప్పుకుంటారు. కానీ ప్రమాదం జరిగితే తప్పు తమది కాదంటే తమది కాదని తప్పించుకునేందుకు ముందు వరుసలో ఉంటున్నారు. తాజాగా గురువారం ఉదయం యాకుత్‌పురా పరిధిలోని ఓ తెరిచి ఉన్న డ్రైనేజీ కాలువలో విద్యార్థిని పడిపోయింది. పక్కనే ఉన్న తల్లి, స్థానికులు తక్షణమే స్పందించి రక్షించడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
విద్యార్థికి ఎటువంటి గాయాలు కాకుండా బయటపడింది. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారులు తప్పు మీదంటే మీదని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. బాధ్యత వహించాల్సిన అధికారులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షం ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో చిన్నారి బతికి బయటపడింది. వరద ప్రభావం ఉంటే పెను ప్రమాదం జరిగేది. నగరంలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చిన్నారి మ్యాన్‌హోల్‌లో పడిపోయిన ఘటనతో జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారుల తీరుపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలా జరిగిందో సమీక్షించుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోకుండా ఒక శాఖపై మరో శాఖ నిందలు వేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని గప్పాలు కొట్టే మూడు శాఖల అధికారులు ప్రమాదం జరిగినప్పుడు వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ నిలదీస్తున్నారు.
ప్రమాదం జరగకపోయి ఉంటే పూడికతీత పనులు తాము చేశామంటే తాము చేశామని గొప్పలు చెప్పుకునేవారు కాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారుల తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. మూడు శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే గ్రేటర్ ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. నాలాలు, డ్రైనేజీల నిర్వహణ హైడ్రాకు అప్పగించిన తర్వాత నుంచే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. మంచి జరిగేతే తామే చేశామని గొప్పలు చెప్పే హైడ్రా.. ఇప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు.
మ్యాన్‌హోల్ మూత తీసి ఉండటంపై తమ తప్పేమీ లేదని జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసింది. మాన్సూన్ అత్యవసర పనులు హైడ్రా చేపడుతున్నదని యాకుత్‌పురాలోని మ్యాన్‌హోల్ మూతను తొలగించింది కూడా హైడ్రా అధికారులేనని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ చేసే ఏ పనుల్లోను నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించలేదని ప్రకటనలో పేర్కొంది. బుధవారం సాయంత్రం రెయిన్ బజార్ మౌలా కా ఛిల్లా ప్రాంతంలో మ్యాన్‌హోల్ పూడికతీత పనులు చేపట్టారు. పని పూర్తి చేసుకుని మూత వేయకుండా వెళ్లారని జీహెచ్ఎంసీ ప్రకటించింది. పూడిక తీత పనులు చేసి చీకటి పడటంతో ఉదయం వచ్చి పనులు కొనసాగిస్తామని పైకప్పును మూసివేయకుండా వదిలేసి వెళ్లినట్లు స్థాకులు చెబుతున్నారు.
మ్యాన్ హోల్ మూత తీసింది జలమండలి సిబ్బందేనని హైడ్రా అధికారులు ప్రకటించారు. ఘటన జరిగిన ప్రాంతంలో కొన్నాళ్లుగా మట్టిపేరుకుపోవడం జెట్టింగ్ మిషన్లతో తొలగించాలని జలమండలి అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. మట్టిని తొలగించిన తర్వాత జలమండలి సిబ్బంది మూత వేయకుండానే అక్కడి నుంచి వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం హైడ్రా సిబ్బంది గుర్తించి మూత వేయడానికి ప్రయత్నించగా పని పూర్తికాలేదని స్థానికులు చెప్పడంతో మూత వేయకుండానే వెళ్లిపోయారని పేర్కొన్నారు.
యాకుత్‌పురా ఘటనతో తమకేమీ సంబంధం లేదని జలమండలి ప్రకటించింది. నాలా పూడికతీత పనులు హైడ్రా అధికారులు చేట్టారని, అందులో తమ ప్రమేయం లేదని తేల్చింది. ఘటన జరిగిన ప్రాంతంలో వరద కాలువ, మూసిన నాలా కలిసి ప్రవహిస్తున్నాయని, అవి జలమండలి పరిధలోకి రావని స్పష్టం చేసింది. అక్కడ పూడికతీత పనులు హైడ్రా చేపడుతున్నదని వెల్లడించింది. ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అయితే జరిగిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవతున్నాయి.