దుండిగల్, మార్చి 8: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కామారెడ్డి జిల్లా, నసూల్ రాబాద్ మండలం, బొప్పానుపల్లి కి చెందిన కేతావత్ శంకర్ నాయక్, పార్వతి దంపతుల కొడుకు కేతావత్ నాను (21), బాచుపల్లి లోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతూ సమీపంలో ఉన్న కళాశాల వసతి గృహంలో ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో నాను, తన స్నేహితులు కార్తీక్, విశ్వంత్ అనే మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి శనివారం స్కూటీపై హాస్టల్ నుంచి బయలుదేరి ప్రగతి నగర్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో స్కూటీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలోకి చేరగానే వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న నాను ఎగిరి కింద పడడంతో అతని పైనుంచి వాహనం దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన నాను అక్కడికక్కడే మృతి చెందగా, కార్తీక్, విశ్వంత్ గాయాలతో బయటపడ్డారు.