Hyderabad | మాదాపూర్ సున్నం చెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను గత నెల 8న హైడ్రా బుల్డోజర్లతో కూల్చివేసింది. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని సామగ్రినీ తీసుకోకుండా వర్షం పడుతున్న సమయంలో కట్టుబట్టలతో బయటకు పంపి కూల్చివేతలు చేపట్టింది. దీంతో వారు నిరాశ్రయులయ్యారు. ఎక్కడికి పోవాలో తెలియక అక్కడే కూల్చివేతల శిథిలాల మధ్యే బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు.
బాధితుల్లో ఎవరినీ కదిలించినా మా బతుకే ఆగమైంది.. ఇక బతుకమ్మ పండుగ ఎట్ల జరుపుకోవాలి అని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇల్లులేక.. పైసలు లేక.. పనులకు పోదామంటే పనులు దొరక్క అంతా ఆగమైపోయిందని బాధిత మహిళలంతా బోరుమంటున్నారు. రేవంత్ సర్కార్ కారణంగా ఈ ఏడాది తమ జీవితంలో బతుకమ్మ పండుగే లేకుండా పోయిందని బాధపడుతున్నారు. ఇది సున్నం చెరువు కూల్చివేతల్లో ఇండ్లు కోల్పోయి సర్వస్వం పోగొట్టుకొని రోడ్డుపాలైన బాధితుల ఆవేదన.
‘మా బతుకే ఆగమైంది.. ఇక బతుకమ్మ పండుగ ఎట్ల జరుపుకోవాలె.. తెల్లారుజామునే వచ్చిర్రు.. కూలగొట్టిర్రు.. పోయిర్రు. ఆ తర్వాత మా దిక్కైనా చూడలేదు. ఇప్పుడేమో పండుగొచ్చింది.. మా బతుకులను ఆగం జేసిన రేవంత్రెడ్డి బాగుపడుతడా.. మేం జరుపుకోని పండుగ వాళ్ల ఇంట్లో ఎట్ల జరుపుకుంటడు.. ఇది న్యాయమేనా..అంటూ సున్నం చెరువు బాధితురాలు తిరుపతమ్మ కన్నీరుమున్నీరైంది.
మా జాగలు తీసుకుర్రు.. మల్ల జాగలు చూపిస్తలేరు. ఎక్కడకు పోవాలె.. ఎట్ల బతకాలె. మాకు పండుగలుండవా.. పోయినసారి సర్కార్ బతుకమ్మ చీరెలు ఇచ్చిర్రు. మేం బాగా జరుపుకున్నం. కూలీకిపోతే నాలుగుపైసలొచ్చేవి.. ఇప్పుడా సంబురమే లేకుండా పోయింది. ఉన్న ఇల్లు కూలగొట్టిండు.. కట్టుబట్టలతో బయటకు వచ్చినం. ఇప్పుడేమో ఇల్లు చూపించడాయె. చీరెలు ముచ్చటే లేదు. ఇదేం ప్రభుత్వం ఇదెక్కడి పాలన.. అంటూ చంద్రుబాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇది ఈ ఇద్దరు మహిళల ఆవేదన మాత్రమే కాదు.. సున్నం చెరువు కూల్చివేతలలో ఇండ్లు కోల్పోయి తమ సర్వస్వం రోడ్డుపాలైన బాధితులందరి ఆవేదన. మహిళలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే బతుకమ్మ పండుగ ఈ బడుగుజీవులకు దూరమైంది..
సిటీబ్యూరో, అక్టోబర్ 1 ( నమస్తే తెలంగాణ ): ఆటపాటలతో ఆనందంగా పండుగ జరుపుకోవలసిన ఈ సమయంలో వారి బతుకే రోడ్డుపాలైంది. కాంగ్రెస్ సర్కార్ పుణ్యమాని వారి జీవితాల్లో ఈ యేడు పూలసంబురమే లేకుండా పోయింది.
శిథిలాల మధ్య బిక్కుబిక్కుమంటూ..!
మాదాపూర్ సున్నం చెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను గతనెల 8న హైడ్రా బుల్డోజర్లతో కూల్చివేసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం తమ ఇంట్లో సామగ్రి బయటకు తీసుకోకుండా వర్షం పడుతున్న సమయంలో అందరిని కట్టుబట్టలతో బయటకు పంపి కూల్చివేతలు చేపట్టింది. దీంతో తామెక్కడకు పోవాలో తెలియక అక్కడే కూల్చివేతల శిథిలాల మధ్యే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వీరి జీవితంలో పండుగసంబురాల మాటేమో కానీ ఎవరు కదిలించినా కన్నీటి వర్షమే కురుస్తుంది.
సున్నం చెరువు బాధితులతో మాట్లాడటానికి వెళ్లిన నమస్తే తెలంగాణకు ఆ ప్రాంతమంతా శిథిలాలతో నిండి హృదయవిదారకంగా కనిపించింది. బతుకమ్మ పండుగ దగ్గరికి వస్తున్నదంటే సొంతూళ్లకు పోవడానికి డబ్బులు రెడీ చేసుకోవడం.. పండుగంతా ఖుషీగా జరుపుకోవడమనేది గత సంవత్సరం వరకు సాగింది. రేవంత్ సర్కార్ కారణంగా ఈ ఏడాది తమ జీవితంలో బతుకమ్మ పండుగే లేకుండా పోయిందని బాధపడుతున్నారు. పెద్దపెద్ద భవనాల జోలికిపోని హైడ్రా తమలాంటి నిరుపేద ఇళ్ల జోలికి వచ్చి మొత్తం ఇంటినే కూల్చేసింది. ఇల్లులేక.. పైసలు లేక.. పనులకు పోదామంటే పనులు దొరక్క అంతా ఆగమైపోయింది.. తమ బతుకే పోయింది.. బతుకమ్మ ఎట్ల జరుపుకోవాలని మహిళలంతా బోరుమన్నారు.
బతుకమ్మ సంబురమే లేదు..!
సున్నం చెరువుబాధితులు అక్కడి శిథిలాల మధ్యే బతుకుతున్నారు. గతనెల నుంచి ఇప్పటివరకు వారు కూలిపోయిన ఇళ్ల మధ్యే గుడిసెలు వేసుకుని కాలంవెళ్లదీస్తున్నారు. పండుగొచ్చింది.. సొంతూళ్లకు పోదామంటే చేతిలో చిల్లిగవ్వలేదు.. కట్టుకోవడానికి బట్టలు.. సామాను కూడా లేకుండా అక్కడా ఇక్కడా మిత్తిలకు తెచ్చి జీవనం సాగిస్తున్నారు. వీరంతా కూలీనాలి చేసుకుని బతికే బడుగుజీవులు. సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి మాత్రమే కాకుండా మహబూబ్నగర్ జిల్లానుంచి ఇక్కడకు కొన్నేళ్ల క్రితం వలస వచ్చి బతుకుతున్నారు.
రేవంత్సర్కార్ తమపై పగబట్టినట్లుగా ఇండ్లు కూల్చేయడంతో తమ జీవితంలో పండుగ లేకుండా పోయిందని వాపోతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి బతుకమ్మ చీరెలు వచ్చాయని, కానీ ఈసారి ఉన్న ఇళ్లు కూడా పోయాయని ఆవేదన చెందుతున్నారు. ఎవరన్నా ఏమన్నా అంటే కేసులు పెడ్తున్నారని భయపడుతున్నారు. కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. ఉండటానికి ఉన్న ఇల్లు కూడా గుడిసె కావడంతో రాత్రైతే ఎలా తెల్లారుతుందా అంటూ భయంభయంగా బతుకుతున్నామని చెబుతున్నారు.
రేవంత్ సర్కార్కు శాపనార్ధాలు పెడుతూ వాళ్లు మాత్రం పండుగ చేసుకోవాలె కానీ మేం చేసుకోవద్దని అనుకున్నడు.. అట్లనే చేసిండని ఆగ్రహిస్తున్నారు. గత నెల కూల్చివేతల్లో పుస్తకాలు ఏరుకుంటూ కనిపించిన చిన్నారులు ఆరోజునుంచి ఈరోజు వరకు బడికి కూడా పోలేదట. పండుగ సెలవులు నెల ముందే వచ్చినయని, పరీక్షలు ఉన్నా.. పుస్తకాలు పోయినయని.. పిల్లలు బాధపడుతున్నారు.
ఇల్లు కూలగొట్టి రోడ్డుపాల్జేసిర్రు
పొద్దుపొద్దుగాల్నె వచ్చి ఇల్లు కూలగొట్టిండ్రు. మమ్మల్ని బయటకు పంపించి కట్టుకునే బట్టలు కూడా తీసుకోకుండా చేసిర్రు. ఇప్పుడేమో బతుకమ్మ పండుగొచ్చింది. ఇల్లే లేదాయె. పండుగ ఎక్కడ చేసుకోవాలె. గతేడాది బతుకమ్మ చీరెలు ఇచ్చిర్రు. ఈ ఏడాది ఉన్న ఇల్లుకూడా కూలగొట్టి మమ్మల్ని రోడ్డుపాల్జేసిర్రు. ఇదెక్కడి న్యాయం. నెలరోజులనుంచి అవస్థలు పడుతున్నం. కూలగొట్టినోడికి కనికరమే లేదాయె.
– చంద్రుబాయ్, స్థానికమహిళ
రేవంత్ రెడ్డికి న్యాయమైతదా..
నిరుడు బతుకమ్మ పండుగ వస్తున్నదంటే ముందే అన్నీ సవరించుకునేది. పెత్రామస ముందే సగబెట్టుకుని సద్దుల వరకు ఊరికి పోయేది. ఇప్పుడేం లేదు. అంతా రోడ్డుపాలైంది. అసలు ఇల్లేలేకుండా పోయింది. ఎట్ల బతుకాల్నో తెలుస్త లేదు. పోయినసారి సర్కార్ బతుకమ్మ చీరెలిచ్చింది. పండుగ మస్త్ ఘనంగా చేసుకున్నం. ఈసారి సర్కారోళ్లు ఉన్న ఇల్లు కూలగొట్టి పండుగే లేకుండా చేసిర్రు. ఇది రేవంత్ రెడ్డికి న్యాయమైతదా.
-భూక్య నీల, స్థానికురాలు
గర్భిణితో ఉన్నా.. నెట్టేసిర్రు
మొన్న మా ఇల్లు కూలగొట్టినప్పుడు మొత్తం నా చిట్టీలన్నీ పోయినయ్. హాస్పిటల్కు పోతే డాక్టర్ పాత చిట్టీలు లేకపోతే నీ రికార్డ్ ఎట్ల చూడాలమ్మ అని తిట్టిండు. పండుగ చేసుకుందామంటే కూడా చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఏం చేయాలే. ఈ కూలిపోయిన ఇంట్లో ఉంటున్న. కరెంట్ లేదు. బయటకు పోదామంటే కిరాయి ఎక్కువైతాంది. కూలిపనిచేసుకునేటోళ్లం. కడుపుతోని ఉన్నా అన్నా కనికరం లేకుండా గుంజి పడేసిర్ర .
– శివకుమారి, స్థానికురాలు
నాకు ఏడుపొస్తుంది..
మాది పెద్దకుటుంబం. ఉన్నపలంగా వచ్చి ఇల్లుకూలగొట్టిపోయిర్ర. ఎక్కడ ఉండాల్నో తెలవక.. వేరే దగ్గరకు పోలేక ఇక్కడనే గుడిసె ఏసుకుని బతుకుతున్నం. కరెంట్లేదు.. నీళ్లు లేవు.. అయినా భయపడుకుంటయినా ఇక్కడనే ఉంటున్నం. మా పిల్లగాళ్లు బతుకమ్మ పండుగొచ్చింది చేసుకుందామంటే నాకు ఏడుపొస్తున్నది. ఏం చేయాలె. ఒక్కరూపాయి లేదు. ఉన్న ఇల్లు కూలిపాయె. కూలగొట్టిర్రు. గిట్ల చేస్తే గవర్నమెంటోళ్లకు న్యాయమైతదా..
-తిరుపతమ్మ, స్థానికురాలు
పోయినసారి బతుకమ్మ చీరెలు ఇచ్చిర్రు
పొద్దుగాలె వచ్చి ఇల్లు కూలగొట్టి పోయిర్రు. మాకు చెప్పని కూడా చెప్పలే. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తీసుకోనియలే. బట్టలు కూడా మట్టికిందే ఉన్నయ్. తీసుకుందామంటే అన్ని చిరిగిపోయినయ్. పోయినసారి ఈసమయానికి బతుకమ్మ ఎంత బాగా జరుపుకున్నం. ఇప్పుడు మా గతేంది. ఉన్న ఇల్లు పోవడంతో. బతుకే లేకుండా పోయింది. బతుకమ్మ చీరెలు పోయిన సారి ఇచ్చిర్రు.
-నీల, స్థానికురాలు
పుస్తకాలు లేవు..బడికిపోతలేను
కూలగొట్టినప్పటినుంచి బడికి పోతలేను. అసలు పుస్తకాలే లేవాయె. చదువుకుందామంటే పుస్తకాలు లేవు. సెలవుల తర్వాత పరీక్షలు ఉన్నయ్. కానీ ఎట్ల రాయాల్నో తెలుస్తలేదు. ఈసారి నాకు ఇల్లు కూలగొట్టిర్రు కాబట్టి బడి బంద్ చేసిన సెలవులు ముందే వచ్చినయ్. ఇల్లు లేక గుడిసెలో పండుకుంటున్నం. రాత్రైతే చెల్లెకు, నాకు భయమైతుంది. దసరా పండుగ చేసుకుందామంటే ఎట్ల చేసుకోవాలె. బతుకమ్మ అంటేనే అమ్మ ఏడుస్తుంది.
– పవన్, ఎనిమిదవతరగతి విద్యార్థి
ఉన్నపలంగ కూలగొట్టిర్రు
మాది పెద్దకుటుంబం. ఉన్నపలంగా వచ్చి ఇల్లుకూలగొట్టిపోయిర్ర. ఎక్కడ ఉండాల్నో తెలవక.. వేరే దగ్గరకు పోలేక ఇక్కడనే గుడిసె ఏసుకుని బతుకుతున్నం. కరెంట్లేదు.. నీళ్లు లేవు.. అయినా భయపడుకుంటయినా ఇక్కడనే ఉంటున్నం. మా పిల్లగాళ్లు బతుకమ్మ పండుగొచ్చింది చేసుకుందామంటే నాకు ఏడుపొస్తున్నది. ఏం చేయాలె. ఒక్కరూపాయి లేదు. ఉన్న ఇల్లు కూలిపాయె. కూలగొట్టిర్రు. గిట్ల చేస్తే గవర్నమెంటోళ్లకు న్యాయమైతదా..
– తిరుపతమ్మ, స్థానికురాలు