సిటీబ్యూరో, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో ఉన్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎగ్జిక్యూటివ్ కోర్టును నిర్వహించారు. హైదరాబాద్‌లోని సౌత్, సౌత్ఈస్ట్, సౌత్‌వెస్ట్ జోన్లలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి వివిధ రౌడీషీటర్లు, క్రిమినల్ గ్యాంగ్‌ల మధ్య జరుగుతున్న గొడవలను ఈ కోర్టులో పరిష్కరించారు.
పది పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన సీవీ ఆనంద్ ఈ గ్యాంగ్‌లు పరస్పరం దాడులు, హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నదన్నారు. 11 గ్యాంగ్‌లకు సంబంధించిన 101 సభ్యులను విడిగా విచారించామని, అందులో ఆరు గ్యాంగ్‌లు తమ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో శాంతియుతంగా రాజీ చేసుకున్నారని తెలిపారు.
మిగిలిన గ్యాంగ్‌లు తమ విచారణ తర్వాత ఎటువంటి నేరాలకు పాల్పడబోమని, శాంతియుతంగా ఉంటామని హామీ ఇచ్చినట్లు సీపీ తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే వారిని బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 126 ప్రకారం శాంతిని కొనసాగించేలా బాండ్ రాయించుకుంటామన్నారు. ఈ కోర్టును తదుపరి విచారణ వరకు వాయిదా వేశారు. సీవీ ఆనంద్ నిర్వహించిన ఈ ఎగ్జిక్యూటివ్ కోర్టుకు స్పెషల్ బ్రాంచ్ డీసీపీ అపూర్వారావు, పది పోలీస్స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు.
రాబోయే పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి
రాబోయే గణేష్ నవరాత్రులు, మిలాద్-ఉన్-నబి పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని, గంగా జమునా తెహజీబ్‌ను నిలబెట్టడానికి పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు హైదరాబాద్ సిటీ పోలీసులతో కలిసి తమ వంతుపాత్ర పోషించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో నగరంలోని అన్ని జోన్ల సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులతో కమిషనర్ సమావేశమయ్యారు.
నగరంలో మొత్తం 1500 మంది పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులున్నారని, పండుగల సమయంలో శాంతిభద్రతలు పరిరక్షించడానికి వీరి తోడ్పాటు అవసరమని ఆనంద్ అన్నారు. పోలీస్ అధికారులు సమాజంలోని సభ్యులతో కలిసి, వారి సహాయసహకారాలు తీసుకుని ముందుకు వెళ్తేనే సరైన పోలీసింగ్ అవుతుందని ఆయన అధికారులకు సూచించారు. సమావేశంలో సెంట్రల్ పీస్ కమిటీ చైర్మన్, అడిషనల్ సిపి విక్రమ్‌సింగ్‌మాన్, డిసిపిలు అపూర్వారావు, స్నేహామెహ్రా, కమిటీ సెక్రటరీకిషన్శర్మ, హఫీజ్ ముజాఫర్హుస్సేన్, శశికాంత్ అగర్వాల్, మహ్మద్మోజమ్అలీ, తేజోవిజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
వినాయక చవితికి విస్తృత ఏర్పాట్లు
వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సౌత్‌జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గణేశ ఉత్సవాలను శాంతియుతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సౌత్‌జోన్ డీసీపీ స్నేహామెహ్రా అన్నారు. బుధవారం తన కార్యాలయంలో పలుశాఖలతో నిర్వహించిన సమావేశంలో జోన్ పరిధిలో గణేశ్ ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని, శానిటేషన్, ప్రజలభద్రత, వాటర్సైప్లె, కరెంట్ సరఫరా, ఇతర అంశాలపై ఆయాశాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, సౌత్‌జోన్ అడిషనల్ డీసీపీ మాజీద్, సౌత్‌జోన్ ఏసీపీలు, శానిటేషన్, ఎలక్ట్రికల్, వాటర్‌వర్క్స్,ఆర్టీఏ, ఫైర్, హెల్త్, ఆర్అండ్బీ, ఆర్టీసీ, సివేజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.