సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : నగరంలో వీధి కుక్కలు చెలరేగి పోతున్నాయి. ఐదేండ్ల లోపు పిల్లలనే లక్ష్యంగా చేసుకుని ప్రతాపం చూపిస్తున్నాయి. కొంత కాలంగా నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి కొనసాగింపుగా శుక్రవారం నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో వీధి కుక్కలు చిన్న పిల్లలపై దాడిచేసి, గాయపర్చాయి. ఈ రెండు ఘటనల్లో ఒకటి కత్బుల్లాపూర్‌లో జరుగగా.. రెండో ఘటన ఎల్బీనగర్లో జరిగింది. వీధి కుక్కల దాడిలో గాయాలపాలైన చిన్నారులు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీధి కుక్కల బారి నుంచి తమను రక్షించాలంటూ మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులను స్థానిక ప్రజలు కోరుతున్నారు. నగరంలో శుక్రవారం రెండు వేర్వేరు ప్రాంతాలలో జరిగిన వీధి కుక్కల దాడి ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
దుండిగల్: పార్కులో ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. రెండున్నరేండ్ల ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని బండారీ లే అవుట్ కాలనీలో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బండారీ లే అవుట్ కాలనీ రోడ్డు నంబర్ 9 (2)లోని వేగ అపార్ట్మెంట్ 103 ఫ్లాట్‌లో నాగసాయి, శ్రీకాంత్ దంపతులు ఉంటున్నారు. వీరికి సోమశ్రీ అనే రెండున్నరేండ్ల కూతురు ఉంది.
శుక్రవారం సాయంత్రం నాగసాయి తన కూతురు సోమశ్రీని తీసుకుని రోడ్డునంబర్ 9(సీ)లో ఉన్న పార్కుకు వెళ్లింది. అక్కడ ఆ చిన్నారి మరికొందరు చిన్నారులతో కలిసి ఆడుకుంటుండగా.. తల్లి మరికొందరు మహిళలతో కలిసి పక్కనే మాట్లాడుతున్నది. అదే సమయంలో పార్కులోకి వచ్చిన ఓ కుక్క ఒక్కసారిగా సోమశ్రీపై దాడి చేయడంతో పాటు.. చిన్నారి మెడపై కరిచింది. ఆ చిన్నారి భయంతో పెద్దగా అరిచింది. అక్కడే ఉన్న కొందరు కుక్కను తరిమి వేశారు. అనంతరం గాయపడిన బాలికను తల్లిదండ్రులు నిజాంపేటలోని హోలిస్టిక్ వైద్యశాలలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.
ఎల్బీనగర్: ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారులపైకి ఓ కుక్క వచ్చి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో చిన్నారి బిట్టు తీవ్ర గాయాలకు గురయ్యాడు. మరో ఇద్దరు చిన్నారులు పరుగెత్తి కుక్క నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన గడ్డిఅన్నారం డివిజన్ శాంతినగర్‌లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. శాంతినగర్‌కు చెందిన ఐదేండ్ల బాలుడు బిట్టుతో పాటు మరో ఇద్దరు చిన్నారులు ఇంటి ఎదుట ఆడుకుంటున్నారు. రెండు వీధి కుక్కలు వీరి వైపు వేగంగా అరుస్తూ వచ్చాయి.
ఈ అరుపులకు భయపడిన ముగ్గురు చిన్నారులు తమ ఇంటిలోకి పరిగెత్తారు. వీరి వెంటే ఇంటిలోకి అరుస్తూ వచ్చిన ఓ కుక్క చిన్నారి బిట్టుపై దాడిచేసి, కాలు వెనుక భాగంలో గట్టిగా కరిచింది. పిల్లల అరుపులు విన్న కుటుంబ సభ్యులు అరవడంతో కుక్క బాలుడిని వదిలి పారిపోయింది. బాలుడి శరీరంపై కుక్క రెండు మూడు చోట్ల గాయపర్చింది. ఈ ఘటనతో ఒక్కసారిగా కాలనీవాసులంతా భయాందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. చిన్నారులపై కుక్కలు దాడి చేసిన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ వీడియోలు చక్కర్లు కొట్టాయి. వీధి కుక్కల బారి నుంచి తమను కాపాడాలని, చిన్నారులకు రక్షణ కల్పించాలని మున్సిపాలిటీ అధికారులను స్థానికులు కోరుతున్నారు.