చంపాపేట, నవంబర్ 3: చంపాపేట డివిజన్ పరిధి కర్మన్ఘాట్ మాధవనగర్ కాలనీ రోడ్ నం-1,5,7 డిఫెన్స్ కాలనీ, ఎస్వీకాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. తాజాగా ఆదివారం మాధవనగర్ కాలనీకి చెందిన వినేశ్ అనే బాలుడు ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా, అతడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో మెడ భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి.
ఆ బాలుడి కుటుంబ సభ్యులు వెంటనే నల్లకుంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. స్థానికులు వెటన్నరీ విభాగం అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు సిబ్బందితో వచ్చి వీధి కుక్కలను పట్టుకెళ్లారు. ఆదివారం ఒక్కరోజులోనే సుమారు 20 మందిపై కుక్కలు దాడి చేసినట్లు మాధవనగర్ కాలనీ సంక్షేమ సంఘం నాయకుడు గోపాల్ ముదిరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు.