మాదాపూర్, ఆగస్టు 12: రైతులు ఆర్థిక సంక్షోభానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలు తగ్గించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని పరిశోధన కేంద్రం సభ్యుడు, సీఆర్ ఫౌండేషన్ నీలం రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్‌లోని నీలం రాజశేఖర్‌రెడ్డి పరిశోధన కేంద్రం రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో చిన్న, మధ్య తరహా రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలపై రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి సిఫార్సులతో కూడిన నివేదికను మంగళవారం నీలం రాజశేఖర్‌రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా రైతుల సమస్యలను గురించి తెలియజేస్తూ .. నేలల భూసారం వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రభుత్వం సమగ్రమైన పంటల సాగు విధానాన్ని ప్రతిబింబించే వ్యవసాయ ప్రణాళికలను రూపొందించాలన్నారు. పోషకాహార భద్రతను కల్పించే ఉద్యానవన, కాయగూరల పంటలకు కూడా గ్యారంటీ మద్దతు ధరలు కల్పించి సాగు విస్తీర్ణాన్ని 6.3 కోట్ల హెక్టార్ల నుంచి 12 కోట్ల హెక్టార్లకు పెంచాలన్నారు. మహిళలను ప్రోత్సహించడానికి అతితక్కువ వడ్డీపై బ్యాంకుల నుంచి రుణాలు కల్పించాలని, ఎరువులను, పురుగు మందుల విక్రయాలను వ్యాపారుల ద్వారా కాక సహకార సంఘాలకు కేటాయించాలన్నారు.