సిటీబ్యూరో, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ) : ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.450 కోట్ల వ్యయంతో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు చేపట్టిన స్టీల్ బ్రిడ్జిని త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను మేయర్ అధికారులతో కలిసి పరిశీలించారు. బంజారాహిల్స్‌లో చేపట్టిన పనులన్నింటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్ ప్రాంతంలో రూ.10.72 కోట్లతో చేపట్టిన మౌలిక సదుపాయాలు కల్పించే పనులను పరిశీలించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నదని ఆమె అన్నారు. ఈ బ్రిడ్జి ద్వారా ఇందిరా పార్కు నుంచి ఆశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, వీఎస్టీ ఉస్మానియా యూనివర్శిటీ వరకు అతి తక్కువ సమయంలో వెళ్లేందుకు వీలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రె, ఎస్ఈ రత్నాకర్, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పాల్గొన్నారు.