బడంగ్‌పేట ఏప్రిల్ 11 : మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు వస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 17లక్షల దళిత కుంటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు ఇవ్వబోతున్నారని తెలిపారు. దశలవారీగా మహేశ్వరం నియోజకవర్గంలో దళితబంధు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడం లేదో బీజేపీ నాయకులను ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. గర్భిణులకు కేసీఆర్ కిట్టు అందజేసి, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు అందజేస్తున్నామని అన్నారు.
అధికారంలోకి రావడానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మకూడదని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు ఎం చేశాయో ప్రశ్నించాలన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణం అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం గక్కుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు తెలిపి దేశ రాజకీయాలను శాసించే విధంగా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని అన్నారు.
బీజేపీ నాయకులు మతం, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి అన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మహేశ్వరానికి ఎన్నో కంపెనీలు వచ్చాయని గుర్తు చేశారు. మహేశ్వరం మండలం అభివృద్ధిలో ముందంజలో ఉన్నామన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.
చెరువులను అభివృద్ధి చేసిన ఘనంత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు. ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. బీజేపీ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, నియోజకవర్గం ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచులు కంది అరుణారమేశ్, మంత్రి సంధ్యారాజేశ్, అనితాప్రభాకర్రెడ్డి, ముక్కెర యాదయ్య, లావణ్యాలింగం, స్లీవారెడ్డి, థామస్‌రెడ్డి, మద్ధి సురేఖాకరుణాకర్రెడ్డి, నాయకులు కూన యాదయ్య, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్‌అలీ, సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.