సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): నిత్యం పేదప్రజలకు అందుబాటులో ఉంటూ వందలాది మంది రోగులకు వైద్యసేవలందించే ఏరియా ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత వెంటాడుతున్నది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపైనే అధిక భారం పడుతున్నది. మరోవైపు సిబ్బంది కొరత కారణంగా సకాలంలో వైద్యమందించడంలో ఏరియా ఆసుపత్రులు విఫలమవుతున్నాయి. ఇటీవల జరిగిన బదిలీల్లో పలువురు ఇతర జిల్లాలకు వెళ్లడం మూలంగా ఖాళీలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రెగ్యులర్ వారితో భర్తీ చేయకపోవడంతో సకాలంలో వైద్యమందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ జిల్లాలోని నాంపల్లి, మలక్‌పేట, గోల్కొండ ప్రాంతాల్లో ఉన్న 100 పడకల ఏరియా ఆసుపత్రులు తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలో పనిచేస్తూ బస్తీ, యూపీహెచ్సీల తరువాత వైద్యసేవలందించడంలో ముందున్నాయి. చాలా వరకు అత్యవసరపు చికిత్సలు, శస్త్ర చికిత్సలు, ప్రసవాలు ఏరియా ఆసుపత్రుల్లోనే జరుగుతుండటం గమనార్హం. కానీ వాటిల్లో సరిపడా సిబ్బంది లేక ఖాళీలు దర్శనమిస్తున్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్ , పీడియాట్రిక్స్, గైనకాలజీ, అనస్తీషియా, ఫార్మసిస్టు, రేడియాలజిస్టు పోస్టులు భర్తీకీ దూరంగా ఖాళీగా ఉన్నాయి.
నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో ఏడుగురు సివిల్ సర్జన్లు కావాల్సి ఉండగా, ముగ్గురు మాత్రమే ఉన్నారు. గోల్కొండ ఆసుపత్రిలో ఆరుగురికి ఇద్దరే ఉన్నారు. మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో ఏడుగురు వైద్యులకు ఇద్దరు మాత్రమే ఉండటం గమనార్హం. మరీ ముఖ్యంగా పీడియాట్రిక్, అనస్తీషియా విభాగాల్లో ఖాళీలు ఉండటం మూలానా అత్యవసర సమయాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఏరియా ఆసుపత్రుల్లో ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్ వంటి పరికరాలు ఉన్నప్పటికీ పరీక్షలు నిర్వహించే రేడియాలజిస్టులు లేకపోవడం వల్ల సకాలంలో టెస్టులు నిర్వహించలేకపోతున్నారు.
ఈ ప్రభావం వల్ల చాలా మంది పేదలు చేసేదేమీ లేక చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. నాంపల్లి, మలక్‌పేట ఏరియా ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులు లేకపోగా, గోల్కొండలో మాత్రం పార్ట్‌టైం పద్ధతిలో ఒకరిని నియమించారు. రేడియాలజిస్టు కొరతకారణంగా గర్భిణులకు , ఇతర రోగులకు చేసే టెస్టులు సకాలంలో చేయకపోవడం వల్ల వారంతా ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నారు.
వారితోపాటు రోగులకు మందులను అందించే ఫార్మసిస్టుల కొరత తీవ్రంగా వెంటాడుతున్నది. నాంపల్లిలో ఉన్న గ్రేడ్ వన్ ఫార్మసిస్టు గజ్వేల్‌కు బదిలీ కావడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అక్కడ నాలుగు పోస్టులు ఉండగా, ఇద్దరితోనే సాగిస్తున్నారు. మలక్‌పేటలో నలుగురు అవసరమవుతుండగా ఒక్కరే ఉన్నారు. గోల్కొండలో సైతం ఒక్క ఫార్మసిస్టు మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం. ఖాళీలు భర్తీ చేయకపోగా, ఉన్నవారిపైనే తీవ్రంగా పనిభారం పడుతున్నది. నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయడంలో జాప్యం చేస్తున్నది.