వెంగళరావునగర్, అక్టోబర్ 17: క్రీడాకారులకు వరం ఆ మైదానం..క్రీడా ఆణిముత్యాల్ని వెలికితీయాలనే దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంకల్పంతో రూపుదిద్దుకున్నదే ఈ క్రీడా ప్రాంగణం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్.పీ.ఆర్.హిల్స్‌లోని క్వారీ గోతుల్ని పూడ్చి చక్కటి క్రీడా మైదానాన్ని దివంగత టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చొరవతో నిర్మితమైంది. నాడు నిరుపయోగంగా.. నిర్మానుష్యంగా..అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన ఈ కొండ నేడు క్రీడాకారులకు బంగారు కొండలా మారింది.
సువిశాల స్థలంలో అంబరాన్ని తాకేలా ఈ క్రీడా మైదానం కనిపిస్తుంది. బోరబండ పరిసర బస్తీల్లోంచి.. తలపైకెత్తి చూస్తే ఈ ప్లే గ్రౌండ్ అల్లంత ఎత్తున కనువిందు చేస్తుంది. ఎస్.పీ.ఆర్.హిల్స్‌లోని ఈ కొండ 9 ఎకరాల స్థలంలో ఉండగా..అందులోని 4 ఎకరాల్లో ఈ క్రీడా మైదానాన్ని నిర్మించారు. మహానగరంలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న క్రీడా మైదానం ఇదొక్కటే కావడం గమనార్హం. గత బీఆర్ఎస్ హయాంలో ఈ క్రీడా మైదానాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తెచ్చారు.
అప్పటి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాకౌట్ క్రికెట్ మ్యాచ్‌లను కొండపైనున్న ఈ క్రీడా మైదానంలో నిర్వహించారు. యూసుఫ్‌గూడ పోలీస్ బెటాలియన్ వద్దనున్న ప్లే గ్రౌండ్ ఉన్నప్పటికీ..ఆ స్టేడియంలో ఆటలాడాలంటే క్రీడాకారులు ముందుగా అనుమతి పొందాల్సి ఉంటుంది. యూసుఫ్‌గూడలోని పోలీసుల క్రీడామైదానం నేలపై కిందే ఉంటుంది. కానీ ఎస్.పీ.ఆర్. హిల్స్‌లోని ఈ క్రీడామైదానం కొండపై ఉండటం ఇక్కడి ప్రత్యేకత. నిరుపయోగంగా నిర్మానుష్యంగా ఉండే ఈ కొండపై ఇంత చక్కటి క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తేవడాన్ని చూసిన స్థానికులు, క్రీడాకారులు ఆశ్చర్యచకితులయ్యారు.
రేపటి పౌరుల క్రీడల కోసం రేయింబవళ్లు దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ శ్రమించారు. కొండల్లో..గుట్టల్లో..గోతుల్లో ఎగుడు దిగుడుగా ఉండే ఈ ప్రాంతంలో భవన నిర్మాణ వ్యర్థాలను తెచ్చి ఇక్కడ పోసి యంత్రాలతో చదును చేయించారు. ఫలితంగా నాలుగెకరాల విస్తీర్ణంలో అద్భుతంగా ఈ క్రీడా మైదానం రూపుదిద్దుకున్నది. ఈ కార్యక్రమాన్ని దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విజయవంతంగా పూర్తి చేయడంతో క్రీడాకారులు, స్థానికులు తెగ సంబరపడిపోతున్నారు.
రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునేలా దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ క్రీడా మైదానాన్ని నిర్మించారు. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్రీడలు ఆడేందుకు సరైన స్థలం లేకపోవడంతో..కృతనిశ్చయంతో ఎస్పీఆర్ హిల్స్ కొండపైనే ఈ క్రీడామైదానాన్ని నిర్మించాలని సంకల్పించారాయన. రెండేళ్లపాటు శ్రమించారు. ఇప్పుడు అద్భుతమైన క్రీడామైదానాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తేగలిగారు. ఈ మైదానం బోరబండ, కార్మికనగర్, రహ్మత్‌నగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాలవాసులకు ఉపయోగకరంగా మారింది.
మాగంటి గోపీనాథ్ చొరవతో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని నిర్మితమైంది. మట్టిలోని క్రీడా రత్నాలను వెలికితీయడమే ఆయన లక్ష్యంగా ఉండేది. గతంలో క్రీడలు ఆడాలన్నా చాలినంతగా స్థలం లేక ఆటలకు దూరంగా ఉండే వాళ్లం. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. భవిష్యత్తులో ఈ క్రీడా మైదానం నుంచి క్రీడా రత్నాలను తయారు చేయొచ్చు. క్రీడల పట్ల ఆసక్తి చూపే పిల్లలకు భవిష్యత్తులో మంచి క్రీడాకారుల్లా తయారు చేయడానికి అవకాశం కల్పించినైట్లెంది.
-ఎం.ఎ.షఫీ రహ్మత్ నగర్ మాజీ కార్పొరేటర్