సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, పోలీస్, వాటర్‌వర్క్స్, విద్యుత్, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండకూడదని, అందరూ విధుల్లో ఉండాలని సూచించారు. తక్కువ సమయంలో ఒకేసారి భారీ వర్షాలు నమోదవుతున్నందున, 141 వాటర్ లాగింగ్ పాయింట్లలో ప్రత్యేక సిబ్బందిని ఉంచి నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ శ్రీనివాస్‌రెడ్డి, జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చెట్లు పడిన ప్రాంతాల్లో వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. సమస్య ఉన్న చోటును గుర్తించి అక్కడికి డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ స్తంభాలు, చెట్ల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మ్యాన్‌హోళ్ల వద్ద ప్రమాదం జరగకుండా చూసుకోవాలన్నారు.