సిటీ బ్యూరో, అక్టోబర్30: (నమస్తే తెలంగాణ): ‘నేను 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న.. అప్పట్లో నాకు 15 ఏండ్లు ఉన్నప్పుడే దొంగ ఓటేసి ఎమ్మెల్యేను గెలిపించుకున్న..’ ఈమాటలు అన్నది ఎవరో కాదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్.. స్వయంగా ఓ నిండు సభలో అందరి ముందు పంచుకున్న మాటలు. అంతే కాకుండా ‘రౌడీలు.. రౌడీలు.. అంటున్నరు.. రౌడీలంటే మంచోళ్లు.. వాళ్లు ఎవరూ పరిష్కరించలేని పంచాయితీలను తీర్మానిస్తరు… నామీద కూడా 35 కేసులున్నయి. .అయితే ఏమైతది..’ ఈ మాటల శ్రీశైలం యాదవ్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నవి. ఇవే కాకుండా ఆయన మాట్లాడిన అన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టా, ఫేస్బుక్, ఎక్స్ వేదికగా ఈ వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. దీంతో జూబ్లీహిల్స్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి తండ్రి నిర్మొహమాటంగా, ఎలాంటి జంకు లేకుండా రౌడీయిజం, దొంగ ఓట్ల గురించి మాట్లాడుతున్నారని ముక్కున వేలేసుకుంటున్నారు. అలాంటి కుటుంబం నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే అయితే తమ పరిస్థితి ఏంటనే సందిగ్దంలో ఉన్నారు. ఆయనను గెలిపిస్తే పెట్రేగి పోతుందని ఆందోళన చెందుతున్నారు.
రౌడీయిజం, సెటిల్మెంట్లు, వసూళ్ల దందా..
ఖైరతాబాద్ నుంచి విడిపోయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంగా ఏర్పడిన నాటి నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పని చేశారు. పార్టీ ఏదైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. పదేండ్లలోనూ దివంగత మాగంటి గోపీనాథ్ నిరుపేదల పాలిటి ఆశాజ్యోతిగా ఉన్నారు. రౌడీలు, సెటిల్మెంట్లు, వసూళ్ల దందాను పూర్తిగా రూపుమాపారు. రౌడీషీటర్ల మెడలు వంచి జూబ్లీహిల్స్‌ను ప్రగతి పథంలోకి నడిపించారు. పేద ప్రజలకు అసలైన పాలన అంటే ఏంటో చూపించారు.
ప్రస్తుత ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే ఆయన కుటుంబం నియోజకవర్గాన్ని ఏం చేస్తుందో ఊహిస్తేనే ఆందోళన కలిగే పరిస్థితి నెలకొంది. రౌడీయిజం, సెటిల్మెంట్లు, వసూళ్ల దందా మళ్లీ పెట్రేగిపోయే ప్రమాదం ఉందని రాజకీయ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ముఖ చిత్రం మొత్తం మారిపోయే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. అరాచకాలను కాకుండా అభివృద్ధిని గెలిపించాలని సూచిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగించాలంటే నేర చరిత్ర లేని అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.
కొడుకు గెలిస్తే.. తండ్రి అరాచకాలు మొదలవుతాయి
శ్రీశైలం యాదవ్ వీడియోలు సోషల్ మీడియాలో చూసిన జూబ్లీహిల్స్ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పదేండ్ల మాగంటి గోపీనాథ్ పాలనలో ప్రశాంతంగా ఉన్న జూబ్లీహిల్స్ అదే విధంగా కొనసాగాలంటే మాగంటి సునీతనే గెలిపించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే శ్రీశైలం యాదవ్ అరాచకాలు మళ్లీ మొదలవుతాయని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ముందే రౌడీయిజం, దొంగ ఓట్లు, పంచాయితీల గురించి మాట్లాడుతున్న నవీన్ యాదవ్ కుటుంబం.. ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రశాంతంగా ఉన్న జూబ్లీహిల్స్ సెటిల్ మెంట్లకు అడ్డాగా మారుతుందని చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నా ఇదే చర్చ జరుగుతున్నది. మాగంటి సంక్షేమ పాలన కొనసాగాలంటే నవీన్ యాదవ్‌ను ఓడించాలని చర్చించుకుంటున్నారు. దినసరి కూలీల నుంచి వ్యాపారుల దాకా అందరూ సంతోషంగా జీవించాలంటే మాగంటి కుటుంబంతోనే సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మళ్లీ కొనసాగాలని కాంక్షిస్తున్నారు.