సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అంటువ్యాధులతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, టీబీ, హెచ్ఐవీ తదితర ఇన్ఫెక్షన్లతో బాధపడే రోగుల కోసం నిమ్స్ వైద్యశాలలో ప్రత్యేక ఓపీ అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ సమస్యలతో బాధపడే రోగులకు జనరల్ మెడిసిన్ విభాగం ద్వారానే చికిత్స అందించేవారు. అయితే ఇతర రోగులతో పాటు అంటువ్యాధుల రోగులు కూడా జనరల్ మెడిసిన్ విభాగానికే వస్తుండటంతో రద్దీ కారణంగా ఇబ్బందులొస్తున్నాయి.
అంతేకాకుండా అంటు వ్యాధులు ఇతర రోగులకు కూడా వ్యాపించే అవకాశం ఉంటున్నది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగా చాలా మంది దీర్ఘకాలికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అంటు వ్యాధిగ్రస్తులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో దవాఖానలో అంటు వ్యాధుల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. ఈ ఓపీ సేవల కోసం ప్రత్యేకంగా ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను నియమించినట్లు తెలిపారు.
ప్రతి మంగళ, గురువారాల్లో..
అంటువ్యాధులు, డెంగీ వంటి విషజ్వర బాధితులకు ప్రతి మంగళ, గురువారాల్లో ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్ ఉంటుందని, నిర్ణీత సమయంలోపు రిజిస్ట్రేషన్ చేయించుకున్న రోగులందరికీ ఓపీ సేవలను అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
అవసరమైతే ప్రత్యేక ఐసీయూ
రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో అంటువ్యాధిగ్రస్తులకు కోసం ప్రత్యేక ఓపీని ఏర్పాటు చేశాం. అంతేకాకుండా వైద్యులపై భారం పడకుండా ఈ ప్రత్యేక ఓపీ కోసం అదనంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వైద్యుడిని నియమించాం. ఇన్ఫెక్షన్ల వల్ల ఎవరూ అనారోగ్యానికి గురికాకుండా సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే ప్రత్యేకంగా ఐసీయూ వార్డును కూడా ఏర్పాటు చేస్తాం.
– డైరెక్టర్ డాక్టర్ బీరప్ప