శేరిలింగంపల్లి ( హైదరాబాద్) : నియోజకవర్గంలో చెరువుల సంరక్షణతో పాటు సుందరీకరణ అభివృద్ది పనులకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి డివిజన్ ఖాజగూడలోని ఎల్లమ్మ చెరువు ప్రాంతంలో కొనసాగుతున్న చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. ఎల్లమ్మ చెరువు వద్ద చేపడుతున్న పనులపై ఆరాతీశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువులో డ్రైనేజీ నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజీ వ్యవస్ధ మళ్లింపు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. చెరువుకట్ట సుందరీకరణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అన్నారు. చెరువు చుట్టు నిర్మించే మురుగునీటి కాలువ నిర్మాణం, అలుగు మరమ్మతులు, చెరువు కట్ట బలోపేతం, పునఃరుద్దరణ పనులు చేపడుతున్నామని వివరించారు.
చెరువుల సంరక్షణలో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, చంద్రకాంత్ రావు, సాయివైభవ్ కాలనీ వాసులు పద్మ, అశోక్‌రాజు, సత్యనారాయణ, రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.