సిటీ బ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నగరంలోని పలు ప్రైవేట్ హాస్టళ్లలో జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ విభాగాల అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన హాస్టళ్లకు షోకాజు నోటీసులు ఇవ్వడంతో పాటు కిచెన్లు సీజ్ చేసి జరిమానాలు విధించారు.
ఎల్బీనగర్ జోన్లోని శ్రీనగర్ కాలనీ, లలితనగర్, దిల్సుఖ్నగర్ ప్రాంతం, కూకట్పల్లి జోన్లోని కేపీహెచ్బీ, మూసాపేట్ ప్రాంతాలు, శేరిలింగంపల్లి జోన్లోని వినాయక్ నగర్, పత్రికా నగర్లలో ఈ డ్రైవ్ నిర్వహించారు. 60 హాస్టళ్లను తనిఖీ చేసి 38 హాస్టళ్ల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. 7 హాస్టల్ కిచెన్లను మూసివేశారు. జీహెచ్ఎంసీ చట్టం, 1955 నిబంధనల ప్రకారం బృందాలు రూ.2,46,000 జరిమానా విధించారు.
అదేవిధంగా శుక్రవారం 58 హాస్టళ్లను తనిఖీ చేసి 30 హాస్టళ్లకు నోటీసులు జారీ చేసి, 8 హాస్టల్ కిచెన్ లను సీజ్ చేశారు. అంతేకాకుండా సుమారు రూ.2.45 లక్షలు జరిమానా విధించారు. హాస్టల్ నిర్వాహకులు నిబంధనల ప్రకారం కాకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు.