కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 18 : కేపీహెచ్‌బీ కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు, వంద పడకల వైద్యశాలను నిర్మించేందుకు వీలుగా స్థలాలను కేటాయించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఎమ్మెల్యేకృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ వినతి పత్రాన్ని అందజేశారు. కేపీహెచ్‌బీ కాలనీలో ప్రభుత్వ పాఠశాల, వైద్యశాల నిర్మాణం కోసం స్థలాలు అందుబాటులో ఉన్నాయని ఈ స్థలాలలో భవనాలను నిర్మించడానికి వీలుగా ఆదేశాలను జారీ చేయాలని కోరారు. కేపీహెచ్‌బీ కాలనీ 9వ ఫేజ్‌లోని రెండున్నర ఎకరాల స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే పార్కుగా తీర్చిదిద్దేందుకు అవకాశమివ్వాలని కోరారు.
అలాగే కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్ వెంచర్-2లో అల్ఫాదాయ వర్గాలకు చెందిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. కేపీహెచ్‌బీ కాలనీలోని సాయినగర్ కాలనీ రెగ్యులరైజేషన్ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యలన్నింటిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు.