హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో సమ్మర్ కోసం అరకొరగానే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకం పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్లు.. వేసవి కాలంలో ప్రయాణించే వారి అవసరాలు తీర్చ లేక పోతున్నాయి. దీనికి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వేసవి రద్దీని సరిగా అంచనా వేయకుండానే ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్లు ఏ మాత్రం సరిపోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ప్రస్తుతం ఇంటర్మీడియట్‌తో పాటు టెన్త్‌క్లాస్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. పైగా వేసవి సెలవులు వచ్చాయి. దీంతో పిల్లలు, వృద్ధులు, మహిళలతో పాటు అధిక సంఖ్యలో ప్రయాణాలు మొదలయ్యాయి. వేసవి అవసరాల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు అవసరమైన వసతి సౌకర్యాలు, ముఖ్యంగా నీటి సదుపాయాలు కల్పించక పోవడంతో పాటు ప్రత్యేక రైళ్లలో అపరిశుభ్రత తాండవిస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు.
రాష్ట్రంలో ఇంటర్, టెన్త్‌క్లాస్ పరీక్షలు పూర్తి కావడం, వేసవి సెలవులు రావడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య సహజంగానే పెరుగుతుంది. దీంతో రైల్లే స్టేషన్లలో ప్రయాణికుల రద్ధీ సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో నమోదవుతుంది. ప్రయాణికుల శ్రేయస్సు కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న రైల్వే అధికారులు.. వారి అవసరాలు తీర్చే విషయంలో మాత్రం ససేమిరా అంటున్నారు.
పైగా సాధారణ రైలు చార్జీల కంటే.. అదనంగా దాదాపు 50 శాతం వరకు రైలు చార్జీలు పెంచుతున్నారు. తెలిసీ, తెలియని ప్రయాణికులపై రైల్వే శాఖ ఛార్జీల బాదుడుతో వారంతా లబో దిబో మంటూ ఆవేదన వ్యకం చేస్తున్నారు. రద్దీ పేరుతో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తూ, వారిలో సరైన వసతులు కల్పించకుండా, జనరల్ టికెట్ చార్జీలపై అదనంగా 50 శాతం వరకు చార్జీలు గుంజుతున్న రైల్వే శాఖ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.